
కరోనా మహమ్మారితో.. 3 రోజుల్లో ముగ్గురు పోలీసులు కన్నుమూత!
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది.. మరణాల సంఖ్య, కేసుల సంఖ్య బీభత్సంగా పెరిగిపోతున్నాయి. కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు కంటిమీద కునుకు లేకుండా తమ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను కొన్ని చోట్ల రక రకాలుగా బ్రతిలాడి, భయపెట్టి ఇంటి నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. కానీ కరోనా ఎవరికైనా వస్తున్న విషయం తెలిసిందే.. కాపలా కాస్తున్న పోలీసు వాళ్లను వదల్లేదు. ముంబై నగరంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అక్కడ పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు మరణాలు ఆగకపోవడం ముంబైకర్లను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ మహమ్మారి బారినపడి మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందటం ఆందోళన రేకెత్తిస్తోంది. ముంబై పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు సోమవారం కన్నుమూశారు. మృతుడిని కుర్లా ట్రాఫిక్ డివిజన్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ 56 ఏళ్ల శివాజీ సోన్వానేగా గుర్తించారు.
అంతే కాదు కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ వకోలా పీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్ చంద్రకాంత్ పెండూకర్, కానిస్టేబుల్ సందీప్ సర్వ్‌లు కూడా గత రెండు రోజుల్లో మృతి చెందారు. ఒక్క మూడు రోజుల్లోనే ముగ్గురు పోలీసులు మరణించడం కన్నీరు పెట్టింది.. కంటికి రెప్పలా కాపలా కాస్తున్న వారు కరోనాతోనే మరణించారు. ఇదిలా ఉంటే రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు మరణాలు ఆగకపోవడం ముంబైవాసులకు కంటమీద కునుకు లేకండా పోతుంది.