ఒక్క రాంగ్ స్టెప్ జలీల్ ఖాన్ రాజకీయ కెరీర్‌కు ఫుల్ స్టాప్..!

Amruth kumar
విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు జలీల్ ఖాన్ పేరు గట్టిగా వినిపించేది. కానీ ఇప్పుడు అదే పేరు వినిపించడం కష్టమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయంగా వేసిన కొన్ని తప్పుటడుగులు జలీల్ ఖాన్ పొలిటికల్ కెరీర్‌ను పూర్తిగా మార్చేశాయన్నది అందరూ ఒప్పుకునే నిజం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన జలీల్ ఖాన్, తరువాత వరుసగా పార్టీలు మారుతూ తనకున్న రాజకీయ బలాన్ని పూర్తిగా కోల్పోయారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో కాంగ్రెస్ తరఫున, 2014లో వైసీపీ తరఫున ఆయన విజయం సాధించారు. అంటే ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టికెట్ ఇవ్వగా, మరోసారి ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఇది జలీల్ ఖాన్ రాజకీయ జీవితంలో అరుదైన అదృష్టంగా చెప్పుకోవచ్చు.



అయితే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఆయనకు టికెట్ ఇచ్చిన పార్టీల పట్లే వ్యతిరేక ధోరణి ప్రదర్శించడం పెద్ద మైనస్‌గా మారింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ బలహీనంగా ఉండటంతో, కాంగ్రెస్, వైసీపీ నుంచి వరుసగా గెలిచే అవకాశం ఆయనకు దక్కింది. సామాజికవర్గం కూడా ఆయనకు కలిసి వచ్చినా, రాజకీయంగా స్థిరత్వం చూపించలేకపోయారు. ముఖ్యంగా 2014లో వైసీపీ నుంచి గెలిచిన తర్వాత, సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ వైపు వెళ్లడం ఆయన కెరీర్‌కు ఫుల్ స్టాప్ వేసిన నిర్ణయంగా మారింది. ఆ నిర్ణయమే ఆయన చివరి ఎన్నికగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జలీల్ ఖాన్ కుమార్తెకు సీటు ఇచ్చినా, ప్రజల నుంచి ఆశించిన మద్దతు రాలేదు. ఫలితంగా ఓటమి తప్పలేదు. అప్పట్లో వైసీపీలో కొనసాగి ఉంటే, మైనారిటీ కోటా కింద ఖచ్చితంగా 2019లో మంత్రి అయ్యేవారన్న మాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది.



2019 నుంచి ఇప్పటి వరకు జలీల్ ఖాన్‌కు ఎలాంటి పదవి దక్కలేదు. గతంలో ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి ఇచ్చినా, ప్రస్తుతం ఆ పదవి కూడా లభించలేదు. 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో, అక్కడ బలమైన అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేసి విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, జలీల్ ఖాన్‌కు ఎలాంటి రాజకీయ గుర్తింపు దక్కలేదు. తెలుగుదేశం పార్టీలో మైనారిటీ నేతలుగా ఇప్పటికే సీనియర్ నాయకులు ఉండటం కూడా జలీల్ ఖాన్‌కు కలిసి రాలేదన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా చూస్తే, ఒకసారి వేసిన రాంగ్ స్టెప్ ఆయనను రాజకీయంగా కోలుకోలేని స్థితికి తీసుకువచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా జలీల్ ఖాన్ పేరును దాదాపు మర్చిపోయినట్టే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: