బర్త్ డే : సీరియల్స్ నుంచి పాన్ ఇండియా హీరో... యష్ గురించి తెలియని ఆసక్తికర విషయాలు

Vimalatha
2018 సంవత్సరంలో ఒక కన్నడ భాషా చిత్రం 'కేజీఎఫ్ : చాప్టర్ 1' విడుదలైంది. అప్పటి నుంచి మొదలుకొని భారతీయ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్రేజ్ ఇప్పటి వరకు తగ్గలేదు. దీనికి ఉదాహరణ 2021 సంవత్సరంలో వచ్చిన దాని సీక్వెల్ టీజర్.. 'కేజీఎఫ్-2' టీజర్ యూట్యూబ్‌లోని పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. ఈ చిత్రంలో నటించిన హీరో యష్ అప్పటి వరకూ కన్నడ సినిమా స్టార్... కానీ ఈ సినిమా తర్వాత ఆయన ఓవర్ నైట్ పాన్ ఇండియన్ సినిమా సూపర్ స్టార్ అయ్యాడు. ప్రజలు ఆయన నడక శైలి, డైలాగులు, మాట్లాడే విధానానికి ఫిదా అయ్యారు. ఈరోజు యష్ పుట్టినరోజు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం.
కన్నడ సినీ నటుడు యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. ఆయన 1986 జనవరి 8న కర్ణాటకలో జన్మించారు. యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తల్లి పుష్ప గృహిణి. మైసూరులో చదువు పూర్తయ్యాక యష్ మనసు నటన వైపు మళ్లింది. యష్ ఒక సాధారణ కుటుంబానికి చెందినవాడు. అయితే అతను తన నటనా నైపుణ్యంతో కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి పేరును సంపాదించుకున్నాడు. యష్ నేరుగా సినిమాల్లో కాకుండా టెలివిజన్ ద్వారా కెరీర్ ను ప్రారంభించారు. .
అశోక్ కశ్యప్ దర్శకత్వం వహించిన టెలివిజన్ సీరియల్ 'నంద గోకుల'తో యష్ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఈ టీవీ సీరియల్ ఈటీవీ కన్నడలో ప్రసారమైంది. దీని తర్వాత కూడా యష్ మరెన్నో టీవీ సీరియల్స్‌లో కనిపించాడు. 2008లో వచ్చిన 'మొగ్గిన మనసు' సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇందులో అతను సహాయ నటుడి పాత్రలో కన్పించాడు. దీనికి అతను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు. 2008లో విడుదలైన 'రాకీ' చిత్రంలో యష్ ప్రధాన నటుడి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 2009లో 'కల్లర్ సంతే', 'గోకుల' చిత్రాలలో చేసినా 2010లో వచ్చిన 'మొదలసాల' యష్ మొదటి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
యష్ 'రాజధాని', 'లక్కీ', 'జాను', 'మిస్టర్ అండ్ మిసెస్ రాంచారి', 'మాస్టర్ పీస్' వంటి చిత్రాలను చేసాడు. అయితే 2018 లో విడుదలైన 'కేజీఎఫ్'లో ఈ కన్నడ స్టార్ కన్పించగా, ఈ సినిమాతో ఆయన క్రేజ్ తో పాటు శాండల్ వుడ్ పరిధి కూడా పెరిగింది. 'కేజీఎఫ్' అత్యంత ఖరీదైన కన్నడ చిత్రం మాత్రమే కాకుండా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం. దాదాపు 250 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు 'KGF: చాప్టర్ 2' కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: