క్రియేటివిటీకి మారు పేరు క్రిష్ !

Vimalatha
టాలీవుడ్‌లో నేటి తరం దర్శకులు చాలా తక్కువ మంది మాత్రమే సరైన మాస్ అప్పీల్‌తో పాటు జీవితంలోని సున్నితమైన అంశాలను టచ్ చేయడం ద్వారా ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. అందులో యువ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఒకరు. వాస్తవిక పాత్రలు, శక్తివంతమైన డైలాగ్స్, జీవితానికి సంబంధించిన గొప్ప సత్యాలను సరిగ్గా వివరించడంతో అతను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.
సినిమా అనేది కళాత్మక వ్యాపారం కాదని, వ్యాపారపరమైన కళ అని నమ్మే వ్యక్తి క్రిష్! ఆయన ఈ నినాదంతో చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె వంటి చిరస్మరణీయ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల కోసం కళాత్మకమైన రీతిలో అందిస్తున్నాడు. క్రిష్ గుంటూరుకు చెందిన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయనకు కథ చెప్పే నైపుణ్యం తన అత్త నుండి వచ్చిందట. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు. ఆల్ ఇన్ వన్. నటీనటుల హావభావాలు ఎలా ఉండాలి అనే విషయంతో పాటు నేపథ్య సంగీతం మాత్రమే కాకుండా ఏదైనా ఫ్రేమ్‌కు ఫ్రేమ్‌ను వివరిస్తాడు.
అమెరికాలో ఎంఎస్ చేసిన క్రిష్ కెరీర్ చలనచిత్ర రంగానికి పూర్తిగా భిన్నంగా ఉండగా, ఆయన స్నేహితులు క్రిష్ లోని క్రియేటివిటీని గమనించి సినిమాలు తీయమని ప్రోత్సహించడంతో నిజమైన ప్రయాణం అక్కడ నుండి ప్రారంభమైంది. 'గమ్యం' తీసిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. అల్లరి నరేష్ పోషించిన గాలి శీను పాత్ర ఆధునిక తెలుగు చిత్రాలలో అత్యుత్తమంగా రూపొందించబడిన పాత్రలలో ఒకటిగా నిలిచింది. తరువాతి చిత్రం 'వేదం', ఇందులో బహుళ కథాంశాలు ఒకే కథగా కలిసిపోయాయి. ఈ సినిమాలో అనుష్క లాంటి గ్లామరస్ స్టార్‌ని వేశ్య సరోజగా చూపించే సాహసం చేశాడు.
కృష్ణం వందే జగద్గురుమ్ మరొక ప్రయోగాత్మక చిత్రం. ఇక్కడ క్రిష్ విష్ణువు పది అవతారాలకు సమానంగా సాధారణ వ్యక్తి జీవిత పరిణామాన్ని చూపించారు. జరుగుతున్నది జగన్నాటకం అనే పాట ఆయన పరాక్రమం గురించి గొప్పగా చెబుతుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కంచె' ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. నందమూరి బాలకృష్ణతో ఆయన చేసిన చారిత్రాత్మక ఇతిహాసం 'గౌతమీపుత్ర శాతకర్ణి' కూడా మరిచిపోలేని చిత్రమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో "హరిహర వీరమల్లు" అంటూ చరిత్రను మరోసారి తిరగరాయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన దర్శకుడిగా చాలా నిష్కపటంగా, నిజాయితీగా ఉంటాడు. క్రిష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: