హెరాల్డ్ బర్త్ డే : 24-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?
జూన్ 24వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
గూడవల్లి రామబ్రహ్మం జననం : సినిమా దర్శకులు సంపాదకులు అయిన గూడవల్లి రామబ్రహ్మం 1902 జూన్ 24వ తేదీన జన్మించారు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు అంతకు మించిన సామాజిక ప్రయోజనం ఉంది అంటూ మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటి చెప్పిన దర్శకుడు హేతువాది గూడవల్లి రామబ్రహ్మం. ఈయన 1934 లో తీసిన శ్రీకృష్ణ లీలలు చిత్రంలో శ్రీకృష్ణుడు పాత్ర వహించడం కోసం రామబ్రహ్మం నిర్మాత కలిసి రాజేశ్వరరావు అనే నటుడిని బెంగళూరు నుంచి తీసుకు వచ్చారు. ఆ తర్వాత 1936లో విడుదలైన ద్రౌపతి వస్త్రాపహరణం సినిమాలో కూడా ఆయన పనిచేశారు.
ఎమ్మెస్ విశ్వనాథన్ జననం : దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ సంగీత దర్శకుడు తెలుగు తమిళ మలయాళ మొదలైన భాషల్లో దాదాపు తొమ్మిది వందల సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడిగా రికార్డు సృష్టించారు ఎమ్.ఎస్.విశ్వనాథన్. 1928 జూన్ 24వ తేదీన జన్మించారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు ఎమ్మెస్ విశ్వనాథన్. ఇక ఈయన అందించిన ఎన్నో సంగీత స్వరాలు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతనికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డును కూడా ఇచ్చి సత్కరించారు. 2015 జూలై 14వ తేదీన చెన్నైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు ఎమ్.ఎస్.విశ్వనాథన్.
విజయశాంతి జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు అయిన విజయశాంతి 1966 జూన్ 23వ తేదీన జన్మించారు. సినీ ప్రస్థానంలో ఏకంగా 180 సినిమాలకు పైగా నటించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు విజయశాంతి. దక్షిణ భారతదేశ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కూడా విజయశాంతి పిలువబడుతుంది. 1991లో కర్తవ్యం సినిమాలో నటించినందుకు గాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది విజయశాంతి. అంతేకాకుండా ఏడు సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అంతే కాకుండా ఎన్నో నంది అవార్డులను కూడా అందుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు హీరోలతో నటించింది విజయశాంతి . ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారింది.
మురళీమోహన్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు నిర్మాత జయభేరి గ్రూప్ అధిపతి అయిన మురళీమోహన్... ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మురళీమోహన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయన 1940 జూన్ 24వ తేదీన జన్మించారు.
పాలగుమ్మి పద్మరాజు జననం : ప్రముఖ తెలుగు రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి గెలుపొందిన గాలివాన కథారచయిత అయిన పాలగుమ్మి పద్మరాజు 1915 జూన్ 24వ తేదీన జన్మించారు, ఈయన తన జీవిత కాలంలో ఏకంగా 60 కథలు 30 కవితలు ఇంకా ఎన్నో నాటకాలు రచించారు. ఈయన రాసిన కథల్లో గాలి వాన, పడవ ప్రయాణం, ఎదురు చూసిన మూహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. 23 ఏళ్ల వయసులోనే తన మొదటి కథను రాశారు పాలగుమ్మి పద్మరాజు. 1983 ఫిబ్రవరి 17వ తేదీన మరణించారు.