నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్ల నిర్మాణానికి సింగ‌రేణి చ‌ర్య‌లు...500 మెగావాట్ల ఉత్ప‌త్తి ల‌క్ష్యం..

Spyder

సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా భారీ నీటి జల‌శయాల మీద తేలియాడే సోలార్‌ పవర్‌ ప్లాంటుల నిర్మాణం కోసం సమయత్తమవుతోంది. సీఎండీ  ఎన్‌.శ్రీధర్‌ చొరవతో సింగరేణి ప్రాంతాల్లోనే కాక రాష్ట్రంలో గల భారీ జలశయాల్లో కనీసం 500 మెగావాట్ల తేలియాడే పవర్‌ ప్లాంటుల నిర్మాణం కోసం కంపెనీ తెలంగాణా రాష్ట్ర రెన్నూవబుల్‌ ఎనర్జీ డెవప్‌మెంట్‌ శాఖ సహాయంతో ప్రతిపాదనను అధ్యయనం చేస్తోంది. సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశంపై టి.ఎస్‌.ఆర్‌.ఇ.డి. సంస్థ వారు ఈ మేరకు రాష్ట్రంలో గల పలు భారీ నీటిపారుదల జలాశయాల మీద నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటుల నిర్మాణానికి గల అవకాశంపై ఆధ్యయనం చేశారు. 

 


సింగరేణి సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌కు ఒక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈ రిపోర్టును వివరించారు. సింగరేణి సంస్థ 500 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్‌ పవర్‌ ప్లాంటులను ఏర్పాటు చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో, ఈ మొత్తం సామర్థ్యం గల ప్లాంటులను ఒకేసారిగా ఒకేచోట నిర్మించే వీలుందా లేక 100 మెగావాట్ల సామర్థ్యంతో 5 దశలుగా నిర్మించే అవకాశం ఉందా అన్న విషయంపై లోతుగా చర్చించారు. కరీంనగర్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లో గల భారీ సాగునీటి జలాశయాల్లో నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్‌) సోలార్‌ ప్లాంట్ల నిర్మాణానికి అనువుగా ఉన్న వాటిపై చర్చించారు. నీటిపై తేలియాడే ప్లాంటుల నిర్మాణం వలన ఎవరికీ ఏ విధమైనా ఇబ్బంది కలగని విధంగా నిబంధనలకు లోబడి నిర్మాణం జరపడానికి తగిన నిర్దిష్ట ప్రతిపాదలను సమర్పించవలసిందిగా సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ కోరారు. 

 


వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే తన 11 ఏరియాల్లో సోలార్‌ ప్లాంటుల నిర్మాణం చేపట్టిన సింగరేణి ఇప్పుడు బయటి ప్రాంతాల్లో వీటి నిర్మాణం కోసం అడుగులు ముందుకు వేస్తోంది. ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, విద్యుత్‌ కొనుగోలు అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉందని సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్‌ (ఇ&ఎం)  ఎస్‌.శంకర్‌ తో పాటు తెలంగాణా రాష్ట్ర రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌ మెంట్‌ శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్‌  రామకృష్ణ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: