అనుచరుడి కోసం కోటంరెడ్డి వీరంగం?

Chakravarthi Kalyan
వేదాయపాలెం పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరంగం వేశారు. తన అనుచరుడు, వైసీపీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లును అరెస్టు చేసిన పోలీసులు... ఆయన్ను పోలీసు స్టేషన్‌కు తీసుకురాలేదన్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ స్టేషన్ లోనే కొద్ది సేపు కూర్చున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఇటీవల టీడీపీ  నాయకుని పై జరిగిన దాడి కేసులో తాటి వెంకటేశ్వర్లను అరెస్టు చేసినట్లు తెలుస్తోందన్నారు.
కోటంరెడ్డి ఆందోళనతో వేదయపాలెం స్టేషన్ కు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. డీఎస్పీతో చర్చల తర్వాత చల్లబడిన కోటంరెడ్డి.. వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఆందోళన విరమించారు. 24 గంటల్లో తాటి వెంకటేశ్వర్లను కోర్టుకి హాజరు పరుస్తామని నగర డిఎస్పి శ్రీనివాస్ చెప్పారని.. నా వెంట నడిచే ప్రజాప్రతినిధులు, నేతలని బెదిరించేందుకే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నాలుగు నెలల కిందట ఇది కేసే కాదని పోలీసులు అన్నారని.. అధికార పార్టీ నుంచి దూరం జరగగానే, ఇప్పుడు కేసు అంటున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి కేసులు ఎన్నిపెట్టినా బెదిరేది లేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి...‌ తాటి వెంకటేశ్వర్లుని అరెస్ట్ చేస్తే, నన్ను అరెస్ట్ చేసినట్టేనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: