ఏపీలో కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు ఇవే?

Chakravarthi Kalyan
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముగించింది. 13 కొత్త జిల్లాలతో ఇక ఏపీలో 26 జిల్లాలు ఏప్రిల్ నాలుగు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అనేక అభ్యంతరాలను ప్రభుత్వం పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. గతంలో పెట్టుకున్న అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలో నిబంధనను కొన్నిచోట్ల పక్కన పెట్టి మార్పులు చేర్పులు చేశారు. అలాగే పలు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాల్లో మార్పులు చేసి తుది జాబితా రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనతో జిల్లాల సంఖ్య 26కు చేరింది. కొత్తగా మరో 24 రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే.. ఎక్కువగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో 4 చొప్పున రెవెన్యూ డివిజన్లు ఉన్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో కొత్తగా కుప్పం, నగరి, పలమనేరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. కృష్ణా జిల్లాలో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటైంది. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి డివిజన్‌ కొత్తగా వచ్చింది.

 
ఇక బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల డివిజన్లు కొత్తగా వచ్చాయి. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్లు కొత్తగా వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో పలాస, కోనసీమ జిల్లాలో కొత్తపేట రెవెన్యూ డివిజన్లు కొత్తగా వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఎన్టీఆర్‌ జిల్లాలో తిరువూరు, నందిగామ డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. ప్రకాశం జిల్లాలో కనిగిరి, కర్నూలు జిల్లాలో పత్తికొండ రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేశారు.

ఇక నంద్యాల జిల్లాలో డోన్, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం లభించింది. అనంతపురం జిల్లాలో గుంతకల్లు, సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరం రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడ్డాయి. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి డివిజన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నాయుడుపేట కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్‌ సూళ్లూరు పేటకు మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: