ఆయుర్వేద ఆమోద జీవోపై డాక్టర్ల నిరసన

yekalavya
గౌహతి: శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆయుర్వేద వైద్యులకు అనుముతినివ్వడాన్ని వ్యతిరేకిస్తూ వైద్య సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి కేంద్రం అనుమతినిస్తూ జీవో జారీచేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆ జీవోను  వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సభ్యులు, డాక్టర్లు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. దీనిపై ఐఎంఏ అసోం రాష్ట్ర చీఫ్ సత్యజీత్ బోరా మాట్లాడుతూ, ఆధునిక వైద్య విధానాన్ని సాంప్రదాయ వైద్య విధనంతో కేంద్రం కలుపుతోందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. సర్జన్ కావడానికి 8 నుంచి 10 ఏళ్లు పడుతుందని, కానీ ఆయుర్వేదంలో 3ఏళ్ల శిక్షణతోనే వైద్యులకు శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతి లభిస్తుందని, ఇది ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై ప్రయోగం చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. రెండు వైద్య విధానాలను కలిపే 'మిక్సోపతి'కి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం వెంటనే సంబంధిత జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం దేశ వ్యాప్త నో-డిమోనిస్ట్రేషన్ స్ట్రైక్‌కు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్లను మోడ్రన్ మెడిసన్ సర్జరీలు చేసేలా అనుమతించే నోటిఫికేషన్‌ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సర్వీసులకు అంతరాయం కలిగింది. అసోంలోనూ ఎమర్జెన్సీ, కోవిడ్ కేర్ సర్వీసులను మినహా ఇతర వైద్య సర్వీసులు కొంత మేర నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు నల్ల రిబ్బన్లు ధరించి డ్యూటీలో సమ్మె పాటించారు.
ఇదిలా ఉంటే ఆయుర్వేద పట్టభద్రులను ఆపరేషన్లు చేసేందుకు అనుమతిస్తే దేశంలోని ఆరోగ్య పరిరక్షణ రంగంలో అవినీతి చోటుచేసుకుంటుందంటూ ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ వ్యాఖ్యానించారు. ఇది వైద్య విధానంలోనే అతి పెద్ద తప్పుగా చరిత్రలో మిగిలిపోతుందని, ఆరోగ్యంపై దేశం రాజీపడితే అదొక పెద్ద వైఫల్యమవుతుందని హెచ్చరించారు. వైద్యుడు కావాలంటే ఏళ్లకు ఏళ్లు పడుతుందని, అలా కాకుండా ‘మిక్సోపతి’ని అనుమతించి కేంద్రం ఏమి ఆశిస్తుందో తమకు అర్థం కావడం లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: