సుధీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయం ..!

N ANJANEYULU
గ‌త కొంత కాలం నుంచి కోవిడ్ -19 కార‌ణంగా  శబరిమల ఆలయం మూతపడింది.  సుధీర్ఘ విరామం త‌రువాత ఎట్టకేలకు తెరుచుకున్న‌ది.  నిన్న సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో  ప్రధాన అర్చకులు కందరారు మహేష్ సమక్షంలో మరో అర్చకుడు వీకే జయరాజ్ శబరిమల ఆలయం గర్భగుడి తలుపులను తెరిచారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు శబరిమల ఆలయ బోర్డు వెల్ల‌డించిన‌ది. శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయంలోకి ఇవాళ్టి నుంచి భక్తులకు అనుమతించారు. డిసెంబర్ 26న శబరిమలలో మండల పూజ ముగుస్తుండగా.. మకరవిళుక్క పండుగ కోసం మరలా డిసెంబర్ 30న తిరిగి ఆలయం తెరుచుకోనున్న‌ది.
అదేవిధంగా జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత జ‌న‌వ‌రి 20 న ఈ ఆలయాన్ని మూసివేయనున్నారు. అయితే అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని దేవస్థానం అధికారులు స్పష్టంచేసారు. వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు భ‌క్తులు వెంట తీసుకురావాల‌ని, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు మాత్రం ఆరోగ్యం చెక‌ప్ చేయించుకొని రావాల‌ని స్ప‌ష్టం చేసారు. శబరిమల ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా దేవస్థానం అధికారులు  ఏర్పాట్లు చేప‌ట్టారు.  
పంపాలో స్నానానికి అనుమతి  అధికారులు ఇచ్చారు.  సన్నిధానంలో బస చేసేందుకు మాత్రం అనుమతులు లేవని చెప్పారు.  పంపాలో వాహనాలకు పార్కింగ్ వసతి ఉండ‌ద‌ని,  వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతి ఉంటుందని వివ‌రించారు. ప్ర‌భుత్వ బ‌స్సులో అందుబాటులో ఉంటాయ‌ని, ద‌ర్శ‌నంముగించుకున్న భ‌క్తులు ఆల‌య ప్రాంగ‌ణం నుంచి వెళ్లిపోవాల‌ని.. కాలి న‌డ‌క ద్వారా వ‌చ్చే భ‌క్తులు స్వామి అయ్య‌ప్ప‌న్ రోడ్డును మాత్ర‌మే ఉప‌యోగించుకోవాల‌ని వివ‌రించారు.  దర్శనం తరువాత ఇచ్చే స్వామివారి ప్రసాదం కోసం పంపా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.  నెయ్యాభిషేకం కోసం భక్తులు తీసుకొచ్చే నెయ్యిని సేకరించేందుకు కౌంటర్లు  దేవస్థానం అధికారులు సిద్ధంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: