మహిళల ఆవేశంలో పరమార్ధం ఇదే ?

VAMSI
నేటి ఆధునిక కాలంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలోనూ ముందుకు దూసుకు వెళుతున్నారు. ఈ పని, ఆ ఉద్యోగం అని లేకుండా ప్రతి పనిలోనూ తమ సామర్ధ్యాన్ని చూపుతున్నారు. ఇటు కుటుంబాన్ని అటు తమ ప్రొఫెషనల్ లైఫ్ ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా మారుతున్నారు. ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేసే సమయంలో కాస్త హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. అయినా సరే తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా ప్రశాంతమైన కుటుంబ జీవనం గడపడానికి ఎందరో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కొందరు తమ ఉనికిని చాటి తమ ప్రతిభను సద్వినియోగ పరుచుకుని తమకంటూ ఒక గుర్తింపు హోదా ఉండాలని తాము ఎంచుకున్న వృత్తిలో ముందుకు సాగుతుంటారు.
ఇలాంటి సమయంలో కొన్ని సందర్భాల్లో మహిళలు ఇంట్లో తమ వారిపై కోపాన్ని , అసహనాన్ని వ్యక్తపరుస్తుంటారు. అలాంటప్పుడు  అందరూ వెంటనే అనుకునే విషయాలు ఈమె ఉద్యోగం చేస్తుందని పొగరు, సంపాదన ఉందని భరోసాతో మనల్ని లెక్క చెయ్యడం లేదు, గర్వం ఎక్కువ. ఇలా చాలానే అనుకుంటుంటారు కొందరు నేరుగా ఈ మాటలను అని వారిని మానసికంగా  బాదపెడుతుంటారు. కానీ ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం మహిళలైనా పురుషులైనా పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తమలో విసుగు ఏర్పడుతుంది. కొంత చిరాకు కలుగుతుంది. ఇవి ఒక స్థాయిని దాటితే ఇతరులపై చూపిస్తారు. అప్పుడే వారి లోని ఒత్తిడి కాస్త అయినా తగ్గింది అనే అనుభూతి వారికి కలుగుతుందట. అందుకే అలాంటి ఒత్తిడి సమయాల్లో వారి కోపాన్ని ఇతరులపై చూపుతుంటారు.
అయితే ఇక్కడ పురుషులకైనా, స్త్రీలకైనా భావనలు ఒకేలా ఉంటాయి. ఇటువంటప్పుడు వారి చిరాకుని, కోపాన్ని తమ కుటుంబ సభ్యులపై చూపుతుంటారు. ఎందుకంటే తమ వారు అయితే తమను అర్దం చేసుకుంటారనే ఒక భావన. అలాంటప్పుడు మహిళలు కూడా పని భారం పెరిగి కొన్ని సార్లు ఇలాంటి  భావనలు వ్యక్తం చేస్తుంటారు. అలాంటి సమయంలో వారిని అర్దం చేసుకుని సర్దుకుపోవాలి కానీ...పురుషులు అరిస్తే అధికారం, భాధ్యత. అదే భావనలు మహిళలు వ్యక్తం చేస్తే అహంకారం అంటూ వారిని కించ పరచకూడదు. అర్దం చేసుకోండి ఆదరించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: