చేతికి దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాలు ధరించి మాంసాహారం తినవచ్చా?
శాస్త్రాల ప్రకారం చేతికి దేవుడి బొమ్మలు లేదా ప్రతిమలు ఉన్న ఉంగరాలను ధరించవచ్చు. అయితే, వాటిని కేవలం ఆభరణాలుగా కాకుండా పవిత్రమైన దైవ సంకేతాలుగా భావించి గౌరవంగా ధరించాలి. అందుకే కొన్ని నియమాలు, పద్ధతులు పాటించడం చాలా అవసరం అని పెద్దలు చెబుతారు.మొదటిగా, దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాలను ధరించే ముందు ఆలయంలో పూజలు, అభిషేకాలు చేయించడం శ్రేయస్కరం. అలా చేయడం వల్ల ఆ ఉంగరానికి ఆధ్యాత్మిక శక్తి వస్తుందని, మనసుకు ప్రశాంతత కలుగుతుందని విశ్వాసం.
ఉంగరాన్ని ధరించే విధానంలో కూడా జాగ్రత్త అవసరం. ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ తల భాగం మణికట్టు వైపు, పాద భాగం చేతి గోళ్ల వైపు ఉండేలా ధరించాలి. ఇది గౌరవాన్ని సూచించే పద్ధతి అని భావిస్తారు.దేవుడి ఉంగరాలు ధరించినప్పుడు పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశం. వాటిని ధరించి అపరిశుభ్రమైన ప్రదేశాలకు వెళ్లడం, అపవిత్రంగా భావించే పనులు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా దేవుడి ప్రతిమలున్న ఉంగరాలు ధరించి మాంసాహారం తినడం, మద్యపానం చేయడం, ధూమపానం చేయడం వంటివి చేయకూడదు అని సంప్రదాయ విశ్వాసం చెబుతుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవి చేయాల్సి వస్తే, ముందుగా ఉంగరాన్ని తీసి శుభ్రంగా, భద్రంగా ఉంచడం మంచిది. అలాగే మహిళలు బహిష్టు సమయంలో దేవుడికి సంబంధించిన ఉంగరాలు, లాకెట్లు లేదా ఇతర ఆభరణాలను తీసి వేరుగా ఉంచాలి. ఆ సమయంలో వాటిని ధరించకూడదని సంప్రదాయం సూచిస్తుంది.
దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాన్ని సాధారణంగా కుడి చేతికి ధరించడం శుభకరంగా భావిస్తారు. ఎడమ చేతికి ధరించడం మంచిది కాదని పెద్దలు చెబుతారు.ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..దేవుడి ఉంగరాన్ని కేవలం ఫ్యాషన్ కోసం లేదా ఆభరణంగా కాకుండా, దైవత్వానికి ప్రతీకగా భావించి గౌరవంగా చూసుకోవాలి. మన ఇంట్లో దేవుడిని ఎలా శ్రద్ధగా చూసుకుంటామో, అలాగే మన శరీరంపై దేవుడికి సంబంధించిన వస్తువులు ఉన్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.ఇలా నియమాలు పాటిస్తూ, శ్రద్ధతో ధరిస్తే దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాలు మనకు ఆధ్యాత్మిక శాంతిని, మనోధైర్యాన్ని అందిస్తాయని విశ్వాసం.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఓ అవగాహన కోసం మాత్రమే. దీనిని ఎంత వరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని గుర్తుంచుకోండి..!!