అడిష‌న‌ల్ వోక‌ల్స్ : విశ్వ క్రీడ‌ల‌కు తెలుగు వ్యాఖ్యానం

VAMSI
ఒక గొంతుక వింటే ప్రభంజ‌నం. ఒక గొంతుక వింటే మ‌న‌వాళ్లే గెలుస్తారన్న న‌మ్మ‌కం. ఓడినా గెలిచినా ఆట అదుర్స్.. ఆమె గొంతుకలో నో ఫియ‌ర్స్ . అవును మొన్న‌టి విశ్వ క్రీడ‌ల‌కూ అంత‌కు మునుపు క‌బడ్డీ లీగ్ కు
లీడ్ వాయిస్ ఆమెదే.. ఆ వ్యాఖ్యానానికి ప్ర‌సిద్ధ మీడియా ఫిదా . ఆ తెలుగు ఉచ్ఛార‌ణ‌కు మైదానంలో కితాబుల వెల్లువ. ఉద్వేగం ఉత్సాహం నిండిన ఆ గొంతుక‌కు ఓ నేప‌థ్యం ఉంది ఆ క‌థ ఏంటో చూద్దామా! పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలోనూ రాణిస్తూ విజయాలను అందుకుంటూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రీడలు, సాహస కృత్యాలు, విద్య ఇలా అన్ని రంగాలలోనూ అత్యున్నత స్థాయిలను అందుకుంటున్నారు. అలా ఎందరో మహిళా మూర్తులు సమాజానికి రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారిలో ఒకరైన  లింగంపల్లి రాధిక రెడ్డి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. రాధిక రెడ్డి ... ఈమె పుట్టింది,పెరిగింది హైదరాబాద్ లోనే. ఈమె ఒక గొప్ప కబడ్డీ ప్లేయర్. ఆ తర్వాత అదే ఆటకు కబడ్డీపై ఉన్న పట్టుతో తనదైన శైలిలో ఎనాలిసిస్ కూడా ఇచ్చారు. అంతే కాకుండా కబడ్డీ లీగ్ లో కబడ్డీ ఆట గురించి ప్రతి ఒక్కరికీ క్లియర్ పిక్చర్ వచ్చేలా తెలిపి అందరి దృష్టిని ఆకర్షించింది.
రాధికా రెడ్డి అక్కడితో ఆగిపోలేదు..ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో లేడీ వ్యాఖ్యాతగా అదరగొట్టారు. ఒలింపిక్స్ కు తెలుగు కామెంటేటర్ గా వర్క్ చేసిన తొలి మహిళగా ఘనతను దక్కించుకున్నారు రాధిక రెడ్డి. తెలుగు వారి ఖ్యాతిని పెంచిన ఆణిముత్యం రాధిక రెడ్డి. ఈమె తండ్రి కూడా ఒక కబడ్డీ ప్లేయర్ అందుకే చిన్న తనం నుండే కబడ్డీపై మక్కువ ఏర్పడిందట. ఇంట్లో వారు కూడా ప్రోత్సహించడంతో చిన్నతనం నుండే కబడ్డీ పోటీలు అంటే చాలు ఎప్పుడూ ముందుడే వారట రాధిక. ఉస్మానియా కాలేజ్ లో ఎంబీఏ పూర్తి చేసిన ఈమె పదిహేనేళ్లు హెచ్ ఆర్ గా పనిచేశారట. స్టార్స్ స్పోర్ట్స్ ఛానల్ వాళ్ళు 2016 ప్రో కబడ్డీకి సన్నాహాలు చేస్తున్న సమయంలో రాధిక రెడ్డి కూడా ఇంటర్వ్యూ కి వెళ్లారట అయితే ఆల్రెడీ కబడ్డీ ప్లేయర్ కావడంతో ఎనలిస్ట్ గా ఎంపికయ్యారు.
రాధిక రెడ్డి ఖేలో ఇండియాకు కామెంటేటర్ గా పని చేస్తున్న సమయంలో సోనీ టీవీ వాళ్లు మొదట సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఓ చిన్న ఇంటర్వ్యూ ద్వారా ఒలంపిక్స్ కామెంటేటర్ గా ఫైనల్ చేశారు. అలా 2020 లో టోక్యో ఒలంపిక్స్ కి కామెంటేటర్ గా పనిచేసి... మొదటి తెలుగు ఒలింపిక్స్ కామెంటేటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాధిక రెడ్డి. దేనికైనా తొలి అడుగు పడాలి...అలా ఆ దారిలో ముందుకు నడిచి సాగినప్పుడే అనుకున్నది సాధించగలం. ఇలా మన రాష్ట్రానికి దేశానికి రాధికా రెడ్డి మంచి పేరును తీసుకొచ్చింది. ఈమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: