అమ్మ: పండంటి పాపాయి కావాలా.. అయితే ఇవి మాత్రం తినకూడదు..!

N.ANJI
బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆడవారి ఒక్క వరం. ఇక అమ్మతనం కోసం ప్రతి మహిళ తపిస్తుంది. గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో కలలు కంటుంది. మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే పండంటి పాపాయి కోసం గర్భణీలు ఆహారం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గర్భవతులు తినకూడని ఆహారం ఏంటో చూద్దమా.
గర్భిణులు విటమిన్‌ ‘ఎ ’ఎక్కువగా ఉండే మాంసాహారము అనగా లివర్‌ వంటివి తినకూడదు. బీటా కెరటీన్‌ ఉండే విటమిన్‌ ‘ఎ’ (కేరెట్స్ ) తినవచ్చును. ఉడకని మాంసము తినకూడదు. ముఖ్యముగా పందిమాంసము తినకూడదు. దీనివల్ల టోక్సోప్లాస్మోసిస్‌ అనే ఇన్ఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీస్తుంది. పిల్లలకు అంధత్వం కూడా రావచ్చు. కాయకూరలు బాగా కడిగి తినాలి. కడగని ఆకుకూరలు, కాయలు, పండ్ల పైన టోక్సోప్లాస్మోసిస్‌ కలుగజేసే బాక్టీరియా ఉంటుంది. గర్భస్థ శిశువుకు ఇది చాలా ప్రమాదకరమైంది.
అంతేకాక పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుచేసిన జున్ను వంటి పదార్థాలను గర్భిణీ స్త్రీలు తినకూడదు. పాచ్యురైజేషన్‌ చేయని పాలలో లిస్టీరియా, బొవైన్‌ టి.బి అనే బాక్టీరియా ఉంటుంది. దానివలన గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. శరీరంలో వేడిని పెంచే పదార్థాలు అంటే ఆవకాయ ,మామిడికాయ, ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి మూడు నెలల్లో తినకూడదు. పచ్చి గుడ్డు, ఉడకని గుడ్లతో చేసిన పదార్థాలను తినకూడదు. పచ్చి గుడ్డులో ఉండే సోల్మోనెల్లా అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ.
అయితే ఫాస్ట్‌ఫుడ్‌, పీజా, బర్గర్‌ వంటి జంక్‌ఫుడ్‌ జోలికి పోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వీటి తయారీలో ఉపయోగించే అజినమోటో శిశువు ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. అందువల్ల వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది. గర్భం దాల్చినపుడు ఎట్టిపరిస్థితుల్లో మద్యపానం, ధూమపానం వంటి వాటి జోలికి పోకూడదు. ఈ రెండింటి వల్ల పుట్టబోయే పిల్లల్లో కాలేయ, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అని వైద్య నిపుణలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: