అమ్మ: గర్భిణీ స్త్రీలు కుంకుమపువ్వు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా...?

Suma Kallamadi

అమ్మ కావాలని,పుట్టే బిడ్డ చక్కగా అందంగా,తెల్లగా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది.అందుకనే చాలామంది గర్భిణీ స్త్రీలు కడుపుతో ఉన్నపుడు కుంకుమ పువ్వు పాలలో వేసుకుని తాగుతారు. ఇది పురాతన కాలం నుంచి ఓ నమ్మకంగా పాతుకు పోయింది. గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తినడం వల్ల పుట్టే బిడ్డలు తెల్లగా ఉంటారన్నది ఒక నమ్మకం. ఇది నమ్మశక్యం కానప్పటికీ, ఇంట్లోని పెద్దవాళ్ళు కుంకుమ పువ్వును పాలు లేదా ఇతర ఆహారంలో కలిపి తినమని గర్భిణీ స్త్రీలకు సలహా ఇస్తూనే ఉంటారు. కాబట్టి, గర్భధారణ సమయంలో మహిళలు కుంకుమ పువ్వు ఎందుకు తినాలి. తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

 

ఖరీదైన కుంకుమపువ్వును గర్భిణులు తీసుకోవటం ప్రమాదం కాదు,కానీ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల శిశువు తెల్లగా పుడుతుందని కొంతమంది అభిప్రాయం. నిజం చెప్పాలంటే, శిశువుల చర్మం రంగు వారి తల్లిదండ్రుల జన్యువుల ఆధారంగా ముందే నిర్ణయించబడుతుంది   కుంకుమ పువ్వుని తక్కువ మోతాదులో గర్భిణులు సేవిస్తే, దానిలోని ఔషధ గుణాల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.సాధారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు, పెరుగుతున్న బిడ్డ కోసం స్థలం కల్పించే ప్రక్రియలో కండరాలు, ఎముకలు విస్తరిస్తాయి. దీని వల్ల కీళ్లలో, పొట్టలో నొప్పి, తిమ్మిరిగా అనిపించ వచ్చు.కుంకుమ పువ్వులో నొప్పిని నివారించే లక్షణాలు గర్భిణీకి నొప్పులు, తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.గర్భిణుల్లో కొందరికి రాత్రి సరైన నిద్ర పట్టక అవస్థ పడుతుంటారు. పడుకోబోయే ముందు పాలతో కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకుంటే, అందులో ఉండే ఉపశమన, హిప్నోటిక్ గుణం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. గర్భధారణ సమయంలో ఆందోళన, మిశ్రమ భావోద్వేగాలు కలగడం సహజం. యాంటీ-డిప్రెసెంట్ గా పిలవబడే కుంకుమపువ్వు మీ మానసిక స్థితిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

 

 

కుంకుమ పువ్వు గర్భాశయ సంకోచాలను ప్రభావితం చేస్తుంది. అందుకని ప్రసవం సమయంలో దీన్ని తీసుకుంటే, ప్రసవంలోని శ్రమను తగ్గించడానికి, సులువుగా ప్రసవం అయ్యేందుకు ఇది సహాయపడుతుందని నమ్ముతారు. గర్భిణులు ఐదో నెల నుంచి కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. మహిళలు సాధారణంగా రోజుకు కేవలం రెండు రేకల కుంకుమపువ్వు (20 నుండి 30 మిల్లీగ్రాములు) తీసుకుంటారు. దీని కంటే ఎక్కువ పరిమాణంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. గర్భిణులు ఒక గ్లాసు పాలతో కొన్ని కుంకుమ పువ్వు కాడలు వేసి తాగడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: