విజయం మీదే: బంధువులకు మీ వల్ల బాధ కలుగుతోందా?
ఇది చాలామంది ఇళ్ళల్లో జరిగేదే, కానీ దాని పర్యవసానం తెలియక చాలా మంది చేసిన పొరపాటు మళ్ళీ మళ్ళీ చేసి వారి సొంత వారికే ఆటంకాలు తెచ్చిపెడుతుంటారు. ఉదాహరణకు చాలామంది ఇళ్ళల్లో తరచూ ఇంటి సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు తలెత్తుతుంటాయి ఇవి చాలా సర్వ సాధారణం. కానీ అప్పటికి ఇవి చాలా చిన్నవి అనిపించినా రేపటి రోజున మళ్ళీ పెద్ద సమస్యలుగా మారే అవకాశం లేకపోలేదు. కొన్ని సార్లు మన విజయానికి ఆటంకం కూడా కలిగిస్తాయి. తద్వారా మన భవిష్యత్తు కూడా అదుపుతప్పి నాశనం అయిపోయే అవకాశం ఉంది. బయట ఎంత కష్టపడి వచ్చినా ఇంటికి వచ్చాక ఒక చిన్న చిరునవ్వు, ఆనందంగా పలకరించే పలకరింపు కాస్త ప్రోత్సాహం లేకపోతే ఇక ఆ వ్యక్తి మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇదలా ఉంచితే వారు మీతో సన్నిహితంగా, సానుకూలంగా లేకపోయినా పర్వాలేదు. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా విసుక్కుంటూ నిందిస్తూ పోతే అది ఎదుటి వారి మనసుని, మానసిక స్థితిని చాలా కృంగదీస్తుంది. అలాంటి సమయంలో ఇక వారు ఎలా తమ భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ వారికి మీరు బలం అవ్వాలి. మీ మాటలు వారికి స్ఫూర్తిని అందించాలి అంతే కానీ అసంతృప్తి మిగిల్చకూడదు. అనవసరమైన ఆలోచనలతో బాధపడేలా చేయకూడదు. వీలైనంత వరకు వారికి అండగా నిలవండి. సంతోషంగా ఉండడానికి కారణం అవ్వండి.