విజయం మీదే: మీ స్వార్థం కోసం ఇంకొకరిని తొక్కేయద్దు... ?

VAMSI

ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరికీ లైఫ్ లో ఎదగాలని ఉంటుంది. వారు కోరుకున్న స్థాయికి చేరుకోవాలి అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుని తాము అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. కొందరు అనుకున్నది సాధిస్తారు. మరి కొందరు పలు రకాల కారణాల వల్ల లక్ష్యం ముందు చతికిలబడతారు. అయితే మనం ఎదగడం కోసం ముందుకు సాగడం కోసం ఎవరినీ వెనక్కి నెట్టేయకూడదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం. మీరు మీ ఆశయాన్ని నెర వేర్చుకోవడం ఎంత ముఖ్యమో , అదే సమయంలో ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ మన వల్ల కలుగకుండా చూసుకోవడం అంతే ముఖ్యం. చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.
ఎవరికో ఏదో జరిగితే మనకెందుకులే అనుకుంటారు. ముందు మన పని మనకు సజావుగా సాగితే చాలులే అని ఇతరుల గురించి ఆలోచించకుండా వారి స్వార్థం వారు చూసుకుంటారు. అయితే ఇది అసలు సమంజసం కాదు. ఇదే విషయాన్ని ఎవరో అనుకుంటే... ఆ స్థానంలో మనం ఉండే అవకాశం ఉంది. వారి స్వార్థం కోసం మనం సమస్యల్లో చిక్కుకొనే అవకాశం లేక పోలేదు. ఇదే విషయాన్ని గుర్తుంచుకొని, వారి స్థానంలో మనముంటే మన పరిస్థితి ఏంటి అని కాస్త ఆలోచించగలిగితే, అలాంటి సందర్భమే రాదు. మనుషుల మధ్య సత్సంబంధాలు పెంపొందుతాయి.
ఇతరుల గురించి కూడా కాస్త పాజిటివ్ గా ఆలోచించగలిగితే అంతా మంచే జరుగుతుంది. మీ మంచి మనసే మిమ్మల్ని మరింత వేగంగా మీ గమ్యానికి చేరేలా చేస్తుంది. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి మన స్వార్ధం కోసం ఇతరులు ఇబ్బందులకు గురి చేసే ఆలోచనలు వదిలి పెట్టండి. న్యాయంగా ప్రయత్నించండి మీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: