విజయం మీదే : ఈ అలవాట్లకు దూరంగా ఉంటే కెరీర్ లో విజయం మీ సొంతం
ప్రపంచం అంతా సక్సెస్ చుట్టూ పరుగెడుతోంది. ప్రస్తుత సమాజంలో ఎవరైతే సక్సెస్ లో ఉంటారో వారికే విలువ. సక్సెస్ ను అందుకున్న వాళ్లకు అంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ సమాజం. అదే సమయంలో ఫెయిల్యూర్ లో ఉన్నవాళ్లను ఎవరూ పట్టించుకోరు. సమాజంలో చాలామంది కెరీర్ లో విజయం సాధించని వారిని చులకనగా చూస్తూ ఉంటారు. ఇతర వ్యక్తులతో పోల్చి వారిని అవమానిస్తూ ఉంటారు.
జీవితంలో ఏ వ్యక్తి అయినా సక్సెస్ సాధించడానికి, సక్సెస్ సాధించకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎవరైతే చెడు సావాసాలు, చెడు అలవాట్లు, అనవసర విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారో వారు విజయం సాధించడం అంత సులభం కాదు. ఎవరైతే లక్ష్యాన్ని నిర్దేశించుకుని... లక్ష్యం కోసం శ్రమిస్తూ... నిరంతరం కష్టపడతారో వారిని మాత్రమే విజయం వరిస్తుంది. మద్యపానం, ధూమపానం, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కువ సమయం గడపడం వల్ల విజయం దూరమవుతుంది.
మనలో చాలామంది మాటలు అద్భుతంగా చెబుతూ ఉంటారు. కానీ ఆచరణలో మాత్రం వారు చెప్పిన మాటలను వారే పాటించకుండా ఉంటారు. ఇలాంటి వ్యక్తిత్వం కూడా చాలా సందర్భాల్లో చెడు చేసే అవకాశం ఉంది. మనం చేసే పనులనే అవతలి వ్యక్తులకు చెప్పాలి. అలా కాకుండా మాటలు ఒక విధంగా చేతలు మరో విధంగా ఉంటే నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. చెప్పింది చేయడం, చేసిందే చెప్పటాన్ని వ్యక్తిత్వంగా మలచుకోవాలి.
మన మాటలతో ఇతరులను ప్రభావితం చేయాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు. మనం లక్ష్యం కోసం శ్రమించే సమయంలో కూడా ఎన్నో సమస్యలు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే సమయం వృథా అవుతూ ఉంటుంది. మన లక్ష్యానికి ఆటంకాలుగా నిలుస్తున్న వాటిని ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటూ లక్ష్యం కోసం శ్రమిస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదు.