విజయం మీదే: ఇలా ఇతరులతో సంభాషణ చేస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మన నిత్య జీవితంలో ప్రతిరోజూ ఎంతో మందితో మనం మాట్లాడుతూ ఉంటాం. వారిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అపరిచితులు అందరూ ఉంటారు. మనం రోజూ ఇతరులతో మాట్లాడే వాటిలో కొన్ని సంభాషణలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ సంభాషణల వల్లే అవతలి వ్యక్తులకు మనపై అభిప్రాయం కలుగుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ సంభాషణలతో అనుకున్న ఫలితాలను పొందడంతో పాటు బంధాలను బలోపేతం చేసుకోవచ్చు. 
 
ఇతరులతో ముఖ్యమైన విషయాలు సంభాషించే సమయంలో ఆ విషయంపై పూర్తి అవగాహన ఉంటే మాట్లాడాలి. అవగాహన లేని మాటల వల్ల నెగిటివ్ ఫలితాలు వస్తాయి. ఆ సంభాషణల ఫలితంగానే బంధాలు బలపడటం లేదా బలహీనపడటం జరుగుతుంది. ఎవరైతే ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సంభాషణల యొక్క ఫలితాన్ని తమకు కావాల్సిన విధంగా ప్రభావితం చేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. 
 
సంభాషణ విషయంలో వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు. మొదటివారు ముఖ్యమైన సంభాషణలను ఎలాగోలా తప్పించుకుంటూ ఉంటారు. రెండవవారు సంభాషణను ఏదో ఒకలా పూర్తి చేయాలనే నెపంతో ఏదో ఒకటి మాట్లాడుతూ నష్టపోతూ ఉంటారు. మూడవ రకం వ్యక్తులు మాత్రం సంభాషణలను విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనం సంభాషించే సమయంలో అవతలి వ్యక్తుల హావభావాలను గమనించాలి. 
 
మనం అవతలి వ్యక్తి లక్ష్యాలను, అవసరాలను పట్టించుకుంటామని అర్థం చేయించటంతో పాటు.... వారి గురించి కూడా మనం చాలా కేర్ తీసుకుంటున్నామని వారికి అర్థమయ్యేలా చేయాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో వాయిస్, బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. అవతలి వ్యక్తులకు నచ్చని విషయాలను, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకపోవడం చాలా వరకు మేలు చేకూరుతుంది. ఈ విధంగా ఇతరులతో సంభాషిస్తే ఏ పనిలోనైనా విజయం సులభంగా సొంతమవుతుంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: