విజయం మీదే : ఈ నియమాలు పాటిస్తే కరోనాపై విజయం మీ సొంతం
కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ భారీన పడి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని నియమాలు పాటించడం వల్ల ప్రజలు కరోనా భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రతిఒక్కరు తమకు తాముగా కరోనా వ్యాప్తి తగ్గేవరకు ఇళ్లకే పరిమితమవ్వాలి.
అత్యవసర పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలతో మాత్రమే బయటకు అడుగుపెట్టాలి. బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కును ఉపయోగించాలి. ప్రతిరోజు కనీసం రెండు గంటలకు ఒకసారి 20 నుంచి 30 సెకన్ల పాటు సబ్బు లేదా శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలి. కరోనా వైరస్ ఎక్కువగా కళ్లు, ముక్కు, నోరు ద్వారా సోకే అవకాశం ఉంది. అందువల్ల చేతులతో కళ్లు, నోరు, ముక్కును అస్సలు తాకకూడదు.
దగ్గే సమయంలో, తుమ్మే సమయంలో మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నా సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి. ఇంట్లో, బయట ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరం పాటించాలి. కరోనా సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి లేదా 104 కు సమాచారం అందించాలి. కరోనా భారీన పడినా లక్షణాలను త్వరగా గుర్తిస్తే వ్యాధిని జయించడం కష్టమేమీ కాదు.