హైదరాబాద్లోని మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలో చిరుత కనిపించిందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.అయితే ఈరోజు దాని మిస్టరీను అటవీ అధికారులు ఛేదించారు.అడవి పిల్లి అనేది మన ఇళ్లలో పిల్లి లాగానే ఉంటుంది కానీ సైజ్ మాత్రం కొంత పెద్దదిగా ఉంటుంది. ఇవి అరుదైన జంతువుల జాబితాలో ఉన్నాయి.అడవి పిల్లి చూడటానికి పిల్లిలా ఉన్నా దాని చూపు, వ్యవహార శైలి అంతాచిరుతపులి లాగానే ఉంటుంది. ఇవి అడవుల్లో ఉండేందుకే ఇష్టపడతాయి. మచ్చలు లేకుండా ఏకరీతి ఇసుక, ఎరుపు-గోధుమ లేదా బూడిద రంగు బొచ్చును కలిగి ఉంటాయి.అడవి పిల్లులు సాధారణంగా మనుషుల జోలికి రావు. మనుషులు కనిపిస్తే.. పారిపోతాయి. ఇవి చిన్న క్షీరదాలు, పక్షులను తింటాయి. ఇవి చిరుత లాగానే వేటాడి తింటాయి.ఇదిలావుండగా హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం అంటూ జరిగిన ప్రచారంపై తాజాగా అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచరించడం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు చిరుత కోసం తీవ్రంగా గాలించారు. చిరుత పాదముద్రలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఎక్కడా చిరుత పాదముద్రల ఆనవాళ్లు కనిపించలేదు. శనివారం ఉదయం అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. జంతువు కదలికలను బట్టి అది చిరుత కాదని అడవి పిల్లి అని చెప్పడంతో మియాపూర్ వాసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిరుత పులికి సంబంధించిన విజువల్స్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో స్పాట్ కు చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో చీకట్లో గాలింపు చర్యలను నిలిపేసిన అధికారులు. ఆ తర్వాత తమ పనిని మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ సంచరించింది అడవి పిల్లిగా తేల్చారు.