రైతులకు తియ్యదనానికి బదులు చేదును రుచిచూపించిన ఫలాల 'రారాజు'.!

FARMANULLA SHAIK
* తగ్గిన దిగుబడులు.. పెరిగిన ఖర్చులు.!
* ఆదాయం రాక మామిడి తోటలు నరికివేత.!
* ప్రత్యామ్నాయ పంటల వైపు చూపు.!
* ప్రోత్సాహాలతోనే మామిడికి భవిష్యత్‌.!
(ఏలూరు-ఇండియా హెరాల్డ్ ): పండ్లలో రారాజుగా పిలిచే మామిడికి  నూజివీడు అనేది కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అక్కడ పంటలలో దశాబ్దాలుగా పాటించిన మెలుకువలు మరియు ప్రత్యేక రకాల సాగులో సాధించిన నాణ్యమైన దిగుబడులు దేశ విదేశాల్లోమామిడికు విపరీతమైన డిమాండ్ సృష్టించాయి.మరి ప్రధానంగా నూజివీడు రసాలు అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.పలు వందల రకాల మామిడి పళ్ళు ఇక్కడ లభిస్తాయి. ప్రసిద్ధి చెందిన నూజివీడు చిన్న రసం పళ్ళకు నూజివీడు పుట్టినిల్లు.నూజివీడు మెట్ట ప్రాంతంలో 60 శాతం మంది రైతులు మామిడి పంటను ప్రధాన సాగుగా చేపడుతున్నారు. రాష్ట్రంలో ఏటేటా 30 నుంచి 40 లక్షల టన్నుల మామిడి దిగుబడి జరుగుతుంది.నూజివీడు ప్రాంతంలో పండే చిన్న, పెద్ద రసాలకు జాతీయ అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంది. నూజివీడు ప్రాంతంలో రసాలతో పాటు బంగినపల్లి, ముంత మామిడి, తోతాపురి ఇతర జాతుల కాయలు ప్రస్తుతం మార్కెట్లో బాగా ఆదరణ పొందాయి.నోరూరించే మామిడిపండ్లు తినని వారు ఉండరంటే ఆశ్చర్యం కలుగకమానదు.
అంతర్జాతీయంగా నూజివీడు మామిడికి డిమాండ్‌ ఉండడంతో ఏటేటా 40వేల టన్నుల మామిడి ఢిల్లీ, నాగ్‌పూర్‌, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. మామిడి ఎగుమతుల ద్వారా రైల్వే శాఖకు ప్రతి యేటా కోట్ల రూపాయల్లో రవాణా ఛార్జీల రూపంలో ఆదాయం సమకూరుతుంది.కెనడా, అమెరికాకు నూజివీడు మామిడి ఎగుమతిఅవుతుంటాయి.అలాంటి మామిడికి గత సంవత్సరం మామిడికి గడ్డు కాలం వచ్చిందనే చెప్పాలి.వరుస నష్టాలతో విసిగిపోయిన రైతులు చెట్లను నరికి పామాయిల్‌, మొక్క జొన్నసాగుకు మారారు. దాంతో మామిడి విస్తీర్ణంబాగా తగ్గిపోయి జిల్లాలోని నూజివీడు, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఎనభై వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా తోటల నరికివేతలతో ప్రస్తుతం నలభై వేల ఎకరాలకు తగ్గిపోయింది. నిత్యం ఏదొక ప్రాంతంలో తోటలను నరికి కర్రను లారీల్లో హైదరాబాద్‌, రాజమహేంద్రవరం మొదలగు వేరే వేరే ప్రాంతాల్లోని ప్లే ఉడ్‌, న్యూ ఉడ్‌ పరిశ్రమలకు తరలిస్తున్నారు.
ఢిల్లీ నుండి గల్లీ వరకు,విజయవాడ నుంచి విదేశాల వరకు మంచి పేరున్న నూజివీడు మామిడి రసం ఒకప్పుడు కాసులు కురిపించి నేడు నష్టాల బాట పట్టి రైతులకు తియ్యదనం కాస్త చేదు అనుభవాన్ని కల్గిస్తుంది.ఇప్పుడు నష్టాలను తట్టుకోలేక తోటలను నరికేస్తున్నారు.గతంలో మామిడి రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేది. ఇప్పుడన్నీ రద్దయ్యాయి.ఏటా సీజన్‌లో ఏదో కారణంతో ధరలు పడిపోవడంతో కోత కూలీ,రవాణా ఖర్చులు చేతికి రాక నష్టాల పాలవుతున్నాం. ప్రభుత్వం చేయూతనందిస్తేనే మామిడి సాగు మిగులుతుంది.అయితే ఒకప్పుడు సీజన్‌లో కొన్ని నెలల ముందు ఢిల్లీ సేఠ్‌లు ఇక్కడికి వచ్చి పెద్ద రైతులతో ఒప్పందాలు చేసుకొంటే రైతులు మామిడి పంట పండించడానికి మక్కువ చూపడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
దాంతో అధిక దిగుబడులు ఆశించిన రైతులు మామిడి తోటలకు విచక్షణారహితంగా రసానిక ఎరువులు, పురుగు మందుల వాడడం వల్ల మొదట్లో అధిక దిగుబడులు వచ్చిన తర్వాత అదే  రైతులకు శాపంగా మారింది.ఎరువులు, పురుగు మందుల వల్ల మామిడి చెట్లకు బాగా చీడపీడలు విజృంభించి మంగు తెగులు వచ్చి నాణ్యత, దిగుబడులు తగ్గిపోయాయి.దీనితో రైతులకు వరుస నష్టాలు ఎదురయ్యాయి.తర్వాత ఢిల్లీ సేఠ్‌ల సిండికేట్‌ మాయాజాలం వల్ల ధరలు పతనం కావటంజరిగింది. ఒకవైపు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు నష్టాల బాట పట్టారు.టీడీపీ హయాంలో మామిడి పునరుద్ధరణ పథకం కింద మామిడి రైతులకు ప్రోత్సాహకాలు అందించేవారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అవన్నీ రద్దయ్యాయి దాంతో మామిడి రైతులకు కన్నీళ్లే మిగిలాయి.మామిడి ఉప ఉత్పత్తులైన తాండ్ర పరిశ్రమ, పల్ఫ్‌ యూనిట్‌, ముక్కల పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: