కంగనా రనౌత్ మరోసారి వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె నటించిన 'ఎమర్జెన్సీ' సెప్టెంబర్ 6న థియేటర్ల లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతున్నారు.ఇదిలావుండగా నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీపై తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించి ఎమర్జెన్సీ ఇతివృత్తం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.అయితే, ఇందులో సిక్కు కమ్యూనిటీకి చెందిన వారి మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సీన్లు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ మూవీ విడుదలపై నిషేధం విధించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.తమ వర్గాన్ని ఎమర్జెన్సీ మూవీలో దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని 18 మంది సిక్కు సభ్యుల బృందం ప్రభుత్వ సలహాదారు అయిన షబ్బీర్ అలీని కలిసి ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిని ఆయన సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయ నిపుణల సలహా మేరకు ఈ చిత్రంపై రాష్ట్రంలో నిషేధం విధించే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో భారతీయులు, దేశం ఎటువంటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నదో వెండితెరపై చూపించేందుకు కంగనా స్వీయ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు సిద్దమైంది.ఇదిలావుండగా 2015లో విడుదలైన 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం ఆమె చివరి విజయవంతమైన చిత్రం అని కంగనా కెరీర్‌ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తరువాత ఆమె నటించిన 10 సినిమాలు తెరకెక్కినా వాటిలో 9 ఫ్లాప్ అయ్యాయి. ఇక మిగిలిపోయిన ఒక్క చిత్రం కూడా హిట్ కాదు యావరేజ్. అంటే 'తను వెడ్స్ మను రిటర్న్స్' తర్వాత విడుదలైన 99 శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.