గర్భిణీ స్త్రీలకు శుభవార్త తెలిపిన ప్రభుత్వం..!

Divya
మాతృత్వం అనేది ప్రతి ఆడవారికి దేవుడిచ్చిన అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. వివాహమైన మహిళలు ఎంతోమంది మాతృత్వం పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన తర్వాత బిడ్డ జన్మించే వరకు గర్భిణీ స్త్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా తమ ఆరోగ్య పరిస్థితితోపాటు తమ కడుపులో పెరుగుతున్న బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా తరచూ అంచనా వేస్తూ.. పలు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తారు.
ఇకపోతే గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో పౌష్టికాహారం చాలా అవసరం.. అందుకే ఇప్పుడు బాలింతలకు,  గర్భిణీ స్త్రీలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి ప్రతి నెల అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న సంపూర్ణ పోషణ మరియు సంపూర్ణ పోషణ ప్లస్ కింద సరుకులు అలాగే ప్రస్తుతం అందిస్తున్న భోజనానికి సంబంధించిన సరుకులను కూడా ఇకపై నేరుగా వారి ఇంటికే అందించాలని నిర్ణయించింది.. జూలై 1 నుంచి సంపూర్ణ పోషణ , సంపూర్ణ పోషణ ప్లస్ కింద బాలింతలు,  గర్భిణీలకు అందించే పోషకాహారం పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు అంగన్వాడీ సెంటర్లలో భోజనం వండి వడ్డిస్తున్న పరిమాణంలోనే.. ఇంటికే సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ.. ప్రతినెల 1 నుండి 5 తేదీల్లో మొదటి విడతగా బియ్యం, కోడిగుడ్లు, కందిపప్పు, నూనె, పాలు, అటుకులు, రాగి పిండి ,బెల్లం చిక్కీలు, ఎండు ఖర్జూరం లాంటివి అందించనున్నారు. అలాగే 16 నుండి 17 తేదీల్లో రెండో విడతగా పాలు, కోడిగుడ్లు అందించనున్నారు. అలాగే గర్భిణీలు , బాలింతలకు అందిస్తున్న 500 గ్రాముల వంతున జొన్న పిండికి బదులుగా కిలో రాగి పిండి ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.  ఇక ఈ మేరకు టెండర్ల నిర్వహణకు అనుమతినిస్తున్నట్లుగా  కూడా ప్రభుత్వం మరోసారి జీవో జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: