ఆటోనే ఇల్లు.. మనవరాలి ఆశే ఊపిరి.. ఓ తాత కన్నీటి గాధ
తెల్లవారితే కుంటుంబం పరిస్థితి ఏంటనే విషయమే ఆయన మనసును తొలిచేసింది. ఆ ఆలోచనతోనే తెల్లవారినదగ్గరి నుంచే ఆటో వేయడం ప్రారంభించాడు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ ఈయన గురించి ప్రపంచానికి చెప్పింది. దేశ్‌రాజ్ కథ చదివి నెటిజన్ల హృదయం ద్రవించింది.
‘‘ఆరేళ్ల క్రితం నా పెద్ద కొడుకు ఓ ప్రమాదంలో చనిపోయాడు. రెండేళ్ల తర్వాత రెండో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులను కోల్పోయాను. కానీ భార్య, కోడళ్లు, వాళ్ల పిల్లలు.. వీరందరి పరిస్థితి ఏంటి? వాళ్ల బాధ్యత నాదే కదా? అందుకే తప్పలేదు. చిన్న కొడుకు పోయాక, నా మనవరాలు వచ్చి.. ‘తాతయ్య నేను చదువు మానేయాలా?’ అని అడిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ చదువును వదలొద్దని చెప్పా. ‘‘కుటుంబం కోసం ఎక్కువ గంటలు పనిచేయడం మొదలుపెట్టా. ఉదయం 6 గంటలకు వెళ్తే ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేవాడిని. చాలా సార్లు ఒక్కపూట తినడానికి కూడా కష్టంగా ఉండేది. అంత బాధలోనూ 12వ తరగతిలో నా మనవరాలు 80శాతం మార్కులతో పాసవడం ఎంతో ఆనందం కలిగించింది.
టీచర్ కావాలనేది నా మనవరాలి కోరిక. తనను టీచర్‌ను చేయాలనుకున్నా. అందుకోసం మేం ఉంటున్న ఇంటిని అమ్మేసి తనకు ఫీజు కట్టా. నా భార్య, కోడళ్లు, మిగతా మనవళ్లను మా ఊరిలోని బంధువుల ఇంటికి పంపేశా. నేను మాత్రం ముంబయిలోనే ఉంటున్నా. ఇల్లు లేదు. కదా.. అందుకే ఆటోలోనే తింటున్నా.. ఆటోలోనే పడుకుంటున్నా. ఇప్పుడు నేను ఆలోచిస్తోంది ఒక్కటే.. ఇప్పుడెప్పుడు నా మనవరాలు టీచర్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నా. ఆ రోజు నేను తనను హత్తుకుని మమ్మల్ని గర్వపడేలా చేశావమ్మా అని చెప్పాలి. ఎందుకంటే మా కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన తొలి వ్యక్తి తనే. ఆ రోజు కూడా నా ఆటోలో అందిరినీ ఉచితంగానే ఎక్కించుకుంటా’’ అంటూ దేశ్‌రాజ్ తాత చిరునవ్వుతో చెప్పుకొచ్చారు.
దేశ్ రాజ్ గురించి ప్రముఖ సోషల్ మీడియా పేజీ హ్యూమన్స్ ఆఫ్ బాంబే చేసిన ఓ పోస్టుతో ఆయన జీవితం ప్రజల ముందుకొచ్చింది. ఇది చూసిన ఓ ఫేస్‌బుక్ యూజర్.. ఏకంగా ఫండ్‌రైజర్ కార్యక్రమం చేపట్టాడు. దీనికి భారీగా స్పందన వచ్చింది. ఇప్పటి వరకు రూ.5లక్షల వరకు విరాళాలు వచ్చాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత అర్చనా దాల్మియా కూడా దేశ్‌రాజ్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. ఆయనకు సాయం చేయాలంటూ నెటిజన్లను కోరారు.
శరీరం క్షీణించి, తల ముగ్గుబట్టయినా.. దేశ్‌రాజ్ ముఖంపై మాత్రం చిరునవ్వులు మాత్రం అలానే ఉండడానికి ఆయన పట్టుదలే కారణమేమో. ఎన్నో బాధలున్నా ఆ నవ్వులో కల్మషం ఉండకపోవడానికి ఆయన జీవితం నేర్పిన పాఠాలే కారణం కావచ్చేమో. రెక్కల కష్టంతోనే తన జీవితాన్ని నెట్టుకొస్తున్న దేశ్‌రాజ్‌నను మనవరాలిని ఉన్నత చదువులు చదివించాలనే ఆశే నిలబెడుతోందనడంలో ఆతిశయోక్తి లేదు. ఏది ఏమైనా దేశ్‌రాజ్ తాతా.. యు ఆర్ గ్రేట్!