ఆవు పేడను కారుకు రాసాడు..మ్యాటరేంటంటే?

Satvika
పేడ న్యాచురల్.. అయితే ఈ పేడను కొన్ని రకాల మందులు, అలంకరణ వస్తువుల తయారీలో వినియోగిస్తారు..కానీ ఓ వ్యక్తి మాత్రం వినూత్న ఆలోచన చేసాడు.తన కారునిండా ఆవు పేడను పులుముకున్నాడు. అయితే దీనివెనుక ఓ అదిరిపోయే కారణం ఉందండోయ్. బేసిగ్గా మన కారుపైన చిన్న గీతపడితే ప్రాణం విలవిల్లాడుతుంది..వర్షాకాలంలో బురద పడితే మాత్రం అస్సలు తట్టుకోరు..మన కారు నిండా ఎవరన్నా పేడను రాస్తే, ఇంకేమైనా వుందా? వెతికి మరీ వారిని పట్టుకొని చితక్కొడతాం. అలాంటిది ఆ కారు యజమానే స్వయంగా తన కారు మొత్తాన్ని పేడతో అలికేశాడు. ఛీ, పేడ కంపు కొడుతుందని అని అంటారా? అయితే అదే తన కారుకి ఇంపు అని అంటున్నాడు ఆ ఓనర్..

అసలు విషయానికొస్తే..పూణెకు చెందిన ఓ వ్యక్తికి సూపర్ ఐడియా వచ్చింది. ఈ మండు వేసవిలో ఎండలు ఏ స్థాయిలో మండుతున్నాయో అందరికీ తెలిసినదే. ఇక పుణేలో అయితే వేరే చెప్పనవసరం లేదు. అక్కడి ఉష్ణోగ్రతలకు మనుషులు బొగ్గుల్లాగా మాడిపోతున్నారు. అలాంటి సమయంలో AC లేని కారులో ప్రయాణించడమేంటే.. కుక్కర్లో కూర్చొని ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది మరి. ఈస్థితిలో ఓ 'మారుతీ ఓమిని' కారు యజమాని ఎండ తాకిడికి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాడు. చివరికి.. అతడికి ఓ కత్తిలాంటి ఐడియా వచ్చింది.

ఆలోచన వచ్చిన వెంటనే షురూ చేసాడు. ఆవు పేడ చల్లదనం ఇస్తుందని తెలియడంతో ఆ కారు యజమాని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓ 2 గంపల పేడ తెచ్చి కారుకు పులిమేశాడు. కేవలం లైట్లు, విండ్‌షీల్డ్స్ తప్పించి కారు మొత్తాన్ని ఇలా ఫొటోలో చూపించినట్టు పేడతో ముంచేశాడు. ఆ తర్వాత జాలీగా ఆ 'పేడ' కలిగిన కారులో చక్కర్లు కొట్టాడు. కాగా ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.. చల్లగా, వేడి లేకుండా ఉండాలంటే ఈ పని చెయ్యాల్సిందే.. మీకు నచ్చితే మీరు ట్రై చెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: