వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్‌.. ఇకపై గూగుల్ మీట్, జూమ్ యాప్‌ల అవసరమే లేదు?

praveen
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు మంచి మంచి ఫీచర్లు తెస్తూ వినియోగదారులను ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వీడియో కాల్‌ల కోసం 2 అదిరిపోయే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో స్క్రీన్ షేరింగ్, ల్యాండ్‌స్కేప్ మోడ్ ఫీచర్‌లు ఉన్నాయి. స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌తో, వినియోగదారులు వీడియో కాలింగ్ సమయంలో తమ డివైజ్ స్క్రీన్‌ని ఇతర వినియోగదారులతో చాలా తేలికగా షేర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులతో పత్రాలు, ఫోటోలు, వారి షాపింగ్ కార్ట్‌ను షేర్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుందన్నమాట. దీనితో పాటు, వీడియో కాలింగ్ సమయంలో మొబైల్‌ను ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో కూడా వాడుకోవచ్చు.
ఈ ఫీచర్‌ మైక్రోసాఫ్ట్ మీట్, గూగుల్ మీట్, జూమ్ అలాగే ఆపిల్ ఫేస్ టైంతో సహా సాంప్రదాయ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లకు సైతం వాట్సాప్ పోటీ ఇస్తుంది అనడంలో సందేహమే లేదు. వాట్సాప్ మాతృ సంస్థ మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, Facebookతో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దాని గురించి సమాచారాన్ని అందించారు. జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో, 'వాట్సాప్‌లో వీడియో కాల్‌ల సమయంలో మీ స్క్రీన్‌ను షేర్ చేసే ఫీచర్‌ను జోడిస్తున్నాం' అంటూ మార్క్ పోస్ట్‌తో స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేయడం జరిగింది. దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అందులో అతను వీడియో కాల్‌లో కనిపించడం కొసమెరుపు. యాప్ వినియోగదారులు తమ స్క్రీన్ షేరింగ్‌కు అనుమతి ఇచ్చినప్పుడే ఈ ఫీచర్ యాక్టివ్‌గా ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా వినియోగదారులు ఎప్పుడైనా స్క్రీన్ షేరింగ్‌ను స్టాప్ చేయగలరు . మీరు వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్‌పై నొక్కినప్పుడు, వాట్సాప్‌లో అలర్ట్ వస్తుంది. దీని తర్వాత, 'స్టార్ట్ నౌ' అనే బటన్‌పై నొక్కితే సరిపోతుంది. బీటా వెర్షన్ 2.23.11.19లో వీడియో షేరింగ్ సమయంలో స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: