అమెరికా భారీ ప్ర‌యోగం.. న‌క్ష‌త్ర శ‌క్తి ద్వారా విద్యుత్..!

Paloji Vinay
మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు నీరు, బొగ్గు, అణుశ‌క్తి ద్వారా విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌డం చూశాం. ఇందులో అణు శ‌క్తి విద్యుత్ ఉత్ప‌త్తిలో అణువుల‌ను విచ్చిన్నం చేయ‌డం ద్వారా ఉత్ప‌న్నం అయ్యే శ‌క్తిని విద్యుత్‌గా మారుతుంది. న‌క్ష‌త్రాల్లోనూ ఇలాంటి ప్ర‌క్రియే జ‌రుగుతుంది కానీ.. ఇందుకు పూర్తిగా వ్య‌తిరేక ప‌ద్ధ‌తిలో అంటే అణువులు విడిపోకుండా విప‌రీత‌మైన వేడీ, ఒత్తిళ్ల కారణంగా ఒక దాంట్లో ఒక‌టి సంలీనం అవుతుంటాయి. ఈ విధ‌మైన ప్ర‌క్రియ‌ను భూమి మీద సృష్టించేందుకు చాలా కాలంగా ప్ర‌యోగాలు జ‌రుగుతూనే ఉన్నాయి.

అయితే, అమెరికాలోని లారెన్స్ లివ‌ర్‌మూర్ నేష‌న‌ల్ లేబొరేట‌రీ (ఎల్ఎన్ ఆర్ ఎల్‌) గ‌త నెలలో చేసిన ప్ర‌యోగాల్లో ఇంత‌క‌ముందు సృష్టించిన శ‌క్తి కంటే ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేశారు. 192 లేజర్‌ కిరణాలను ఉపయోగించి కొన్ని మిల్లీమీటర్ల ప‌రిమాణం ఉన్న‌ ఇంధనాన్ని బాగా వేడెక్కించగా లేజర్‌ కిరణాల కోసం ఖర్చు పెట్టిన శక్తి కంటే 1.3 మెగాజౌళ్ల శక్తి అదనంగా ఉత్ప‌త్తి అయింది. కిలో ముడిచమురు ద్వారా పుట్టే శక్తిలో ఇది మూడు శాతంగా ఉంది.

  కేంద్రక సంలీన ప్రక్రియను సాధించేందుకు ప్రస్తుతం రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లో అనుసరించిన ఇనర్షియల్‌ కన్‌ఫైన్మెంట్ ప‌ద్ధ‌తి, మ‌రొక‌టి మాగ్నైట్‌ సాయంతో ప్లాస్మాను నియంత్రించేది. ఇనర్షియల్‌ కన్‌ఫైన్మెంట్‌లో శక్తిమంతమైన లేజర్లను సెకనులో వందకోట్ల వంతు ప్రయోగిస్తారు. ఇది సంలీన ప్రక్రియను ప్రారంభిస్తుంది. శక్తిమంతమైన లేజర్లు, ఇతర టెక్నాలజీలు అందుబాటులో లేనందునా ఇప్పటి వరకూ రెండో పద్ధతిపైనే ఎక్కువ ఆధారపడేవారు శాస్త్రవేత్తలు. ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లోని నేషనల్‌ ఇగ్నిషన్‌ ఫెసిలిటీలో 192 లేజర్‌ కిరణాలను గది మధ్యలో ఉంచిన మిలీమీటర్ల సైజున్న లోహంపై పడేలా చేస్తారు.


అప్పుడు ఎక్స్‌రే కిరణాలు వెలువడి లోహం వేడెక్కి ఇంధనాన్ని పీడనానికి గురి అవుతుంది. ఈ క్రమంలో ఎక్కువ శక్తి పుట్టినప్పటికీ వాణిజ్య స్థాయిలో విద్యుదుత్పత్తికి ఇది చాల‌దు. ఉపయోగించిన ఇంధనం కంటే త‌క్కువ‌లో త‌క్కువ‌గా వంద రెట్లు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిన అవ‌సరం ఉంటుంది. ఫ్యూజ‌న్‌ ప్ర‌యోగాల కోసం ఇప్ప‌టివ‌ర‌కు 200 కోట్ల డాల‌ర్ల నిధుల‌ను పెట్టుబ‌డిగా పెట్టారు. ఇది ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు పెట్టేదానికి చాలా అద‌నం కావ‌డం గ‌మ‌నార్హం.  20 ఏళ్ల‌లో వాణిజ్యస్థాయికి విద్యుత్ ఉత్ప‌త్త‌కి ఈ ప్ర‌క్రియ సాయ‌ప‌డుతుంద‌ని న‌మ్ముతున్నారు. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పుల కార‌ణంగా ఫ్యూజ‌న్ రియాక్ట‌ర్‌లు త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్న‌ట్టు తెలుస్తోంది. అన్ని స‌వ్యంగా సాగితే 2060 లోగా ప్ర‌పంచ విద్యుత్ అవ‌స‌రాల్లో ఒక‌శాతం విద్యుత్ ఫ్యూజ‌న్ రియాక్ట‌ర్ల వ‌ల్ల పంపిణీ జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: