వ‌చ్చే దశాబ్దం ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్స్‌దేనా..?

        ఓ పదేళ్ల క్రితం చూస్తే ఎంట్రీ లెవెల్ నుంచి హై ఎండ్ మోడ‌ల్స్ కార్ల వ‌ర‌కు ఏ దేశంలో చూసినా, ఏ కంపెనీ ఉత్ప‌త్తులు చూసినా పెట్రోల్, డీజిల్ తోనే న‌డిచే వాహ‌నాలదే రాజ్యం. అస‌లు వాటికి మ‌రో ప్ర‌త్యామ్నాయ‌మే ఊహించ‌లేని విష‌యం. ఇక ద్విచ‌క్ర వాహ‌నాల ప‌రిస్థితీ దీనికి భిన్నం కాదు. రూ.50 వేలకు కాస్త అటూఇటూగా దొరికే బైక్‌లు, మోపెడ్‌లు, స్కూట‌రెట్ల మొద‌లు రూ. 25 ల‌క్ష‌ల‌కు పైగానే ప‌లికే అత్యంత ఖ‌రీదైన బైక్‌లు పెట్రో ఉత్ప‌త్తుల‌తో న‌డిచేవే. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారుతోంది. ప్ర‌ధాన ఆటోమొబైల్ కంపెనీల‌న్నీ ఎల‌క్ట్రిక‌ల్ వెహిక‌ల్స్‌ త‌యారీ వైపు శ‌ర‌వేగంగా అడుగులు వేస్తున్నాయి. అమెరికాకు చెందిన టెస్లా ఈ దిశ‌గా అంద‌రికంటే ముందుంది. ఈ కంపెనీ వాహ‌నాలు విశేష‌మైన ఆద‌ర‌ణ‌కు నోచుకోవ‌డంతో  సంస్థ మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోవ‌డం, ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన కంపెనీల లిస్టులోకి చేరిపోవడం, ఆ కంపెనీ అధినేత ఎలాన్ మ‌స్క్ ప్ర‌పంచ కోటీశ్వ‌రుల్లో అగ్ర‌స్థానం చేజిక్కించుకోవ‌డం ఇటీవ‌లి కాలంలో చాలా వేగంగా జ‌రిగిపోయిన ప‌రిణామం.

 
       పెట్రో ధ‌ర‌ల భారం అంత‌కంత‌కూ పెరిగిపోవ‌డం,  వెలికితీయ‌గ‌ల పెట్రోల్ నిల్వ‌లు అంత‌కంతకూ త‌రిగిపోతుండ‌టంతో భ‌విష్య‌త్తులో ఈవీల‌దే రాజ్య‌మ‌ని భావిస్తున్న ఆటోమొబైల్ కంపెనీలకు టెస్లా విజ‌యం స్ఫూర్తినిచ్చింద‌ని చెప్పాలి. 2020తో పోలిస్తే 2021 లో ఎల‌క్ట్రానిక్ వాహ‌నాల అమ్మ‌కాలు ఏకంగా 160 పెర‌గ‌డం చూస్తే ఈ ఏడాది ఆ కంపెనీల‌కు అదో మైలురాయ‌నే భావించాలి. ఇక పెట్రో దిగుమ‌తుల‌కు అత్య‌ధికంగా విదేశీ మార‌క ద్ర‌వ్యం వెచ్చించాల్సిరావ‌డంతో ప్ర‌భుత్వాలు కూడా ఈవీల త‌యారీ కంపెనీల‌కు గ‌ణ‌నీయ‌మైన ప్రోత్సాహ‌కాలు అందిస్తున్నాయి. దీంతో దేశీయ ఆటో మొబైల్ దిగ్గ‌జాల‌న్నీ వీటి త‌యారీలో భాగం పంచుకునేంద‌కు విదేశీ కంపెనీల‌తో ఒప్పందాలు, ప‌రిశోధ‌న‌ల్లో మునిగిపోయాయి. అంటే భార‌త్‌లోనూ భ‌విష్య‌త్తులో విద్యుచ్ఛ‌క్తితో న‌డిచే వాహ‌నాలే రోడ్ల‌మీద అధిక సంఖ్య‌లో క‌న‌న‌బ‌డ‌పోతున్నాయ‌న్న‌మాట‌. ఇప్ప‌టికే ద్విచ‌క్ర వాహ‌నాలు పెద్ద సంఖ్య‌లో మార్కెట్‌లోకి రాగా వాటికి ప్ర‌జ‌ల నుంచి మంచి ఆద‌ర‌ణ కనిపిస్తోంది.  ఇక హైవేల వెంట పెట్రోల్ బంక్‌ల‌కు పోటీగా వాహ‌నాల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు కొన్ని కంపెనీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇది ఈ ఏడాది ఆశాజ‌న‌కంగా క‌నిపిస్తున్న ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన మార్పు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: