విరాట్ కోహ్లీ వివాదం ముదురుతోంది... నిజంగా చేశాడంటారా?
ఇక యువరాజ్ సింగ్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడంటే కాస్త కామన్ అయిపోయింది కానీ, ఒకప్పుడు 6 బంతుల్లో 6 సిక్స్ లు అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు అతగాడిదే. వన్డే, టీ20 ప్రపంచ కప్‌లను టీమ్ ఇండియా విజయం సాధించడంలో యువీది అప్పట్లో చాలా కీలక పాత్ర అయ్యేది. ఈ రెండు వరల్డ్ కప్‌లను కూడా ధోనీ నాయకత్వంలోనే భారత జట్టు దక్కించుకుంది. అయితే తాజాగా యూవీ కెరీర్ పై సారథిగా కోహ్లీ వ్యవహరించిన తీరు సరైనది కాదంటూ ఉతప్ప అనడంతో మరోసారి ఈ మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
క్యాన్సర్ ను జయించి 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి యూవీ పునరాగమనం చేసినప్పుడు అతడికి విరాట్ మద్దతుగా నిలవలేదని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కెప్టెన్సీని కోహ్లీ, రోహిత్ ను పోల్చే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. సారథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మార్గాలు భిన్నమైనవని పేర్కొన్నాడు. "క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలని చాలా ట్రై చేసాడు. అతడు 2 వరల్డ్ కప్ లు గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అతడు కేవలం టోర్నమెంట్ లు మాత్రమే గెలవలేదు. క్యాన్సర్ ను కూడా జయించాడు. జీవితంలో అత్యంత కష్టమైన దశను ఎదుర్కొన్నాడు. అలాంటి వ్యక్తికి జట్టులో అవకాశం ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. వీటి గురించి నేను గమనించిన విషయాలను మాత్రమే చెబుతున్నాను. యువీకి అప్పుడు లంగ్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఫిట్ నెస్ విషయంలో 2 పాయింట్ల తగ్గింపు కోసం యూవీ అభ్యర్థించినప్పుడు కోహ్లీయే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ రోహిత్ శర్మ అలా కాదు... అందరినీ కలుపుకొని పోయే స్వభావం కలిగిన కెప్టెన్" అని ఉతప్ప చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.