పతనం దిశగా పాక్ క్రికెట్.. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ కంటే దారుణం?
ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో చెత్త ప్రదర్శన చేసి కనీసం సూపర్ 8 లో కూడా అడుగుపెట్టకుండా టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు.. ఇక ఆ తర్వాత జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లలో కూడా అదే తీరు ఆట తీరుతో ఇక సొంత అభిమానులకు సైతం చిరాకు తెప్పిస్తుంది. అయితే ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా సత్తా చాటలేక పోతుంది పాకిస్తాన్ జట్టు. ఇటీవల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది. చిన్న టీం అయిన బంగ్లాదేశ్ కి కనీస పోటీ ఇవ్వలేకపోయింది పాకిస్తాన్.
పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అంతే కాకుండా పాకిస్తాన్ జట్టును వారి సొంత గడ్డమీద పది వికెట్ల తేడాతో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా కూడా పసికూన బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. కాగా ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 448 పరుగులకు పాకిస్తాన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఇక రెండో ఇన్నింగ్స్ లో 146 పదవులకే చాప చుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో 565 పరుగులు చేసిన బంగ్లా రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి పద వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయాన్ని అందుకుంది.
అయితే ఒకప్పుడు వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీం గా కొనసాగిన పాకిస్తాన్ రోజురోజుకీ వైభవాన్ని కోల్పోతుంది. ఆ దేశంలో ఉన్న పరిస్థితులు.. క్రికెట్ బోర్డులో రాజకీయాల జోక్యం.. జట్టులోని ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకపోవడం.. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం.. ఇలాంటివన్నీ కూడా పాకిస్తాన్ క్రికెట్ ను పూర్తిగా నాశనం చేసేస్తున్నాయి. ఈసారి టి20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ లాంటి పసికూన చేతిలో దారుణ ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. ఈ ఓటమిని మరవకముందే ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలోనూ దారుణ ఓటమిపాలైంది. ఇలా పాకిస్తాన్ క్రికెట్ రోజురోజుకీ పతనం అవుతున్న తీరు అక్కడి అభిమానులను సైతం ఆందోళనకు గురిచేస్తుంది.