డబుల్ సెంచరీ చేశాడని.. జైశ్వాల్ నూ హీరోని చేయకండి : గంభీర్
ఇటీవల కాలంలో భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న యువ ఆటగాళ్ళ విషయంలో ఇదే జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో టీమిండియాలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు చోటు సంపాదించుకొని సత్తా చాటుతున్నారు. అయితే ఎవరైనా ఆటగాడు ఇలా జట్టులోకి వచ్చిన కొత్తలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు ఇక అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది అని చెప్పాలి. ఏకంగా అతను ఒక గొప్ప యోధుడు.. హీరో అంటూ అందరూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇటీవల విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ తో ఆకట్టుకున్న యశస్వి జైష్వాల్ పై కూడా ఇలాగే ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల యశస్వి జైస్వాల్ చేసిన డబుల్ సెంచరీకి మితిమీరిన ప్రచారం కల్పించవద్దు అంటూ గౌతమ్ గంభీర్ కోరాడు. ఇండియాలో అందరికీ ఓ లక్షణం ఉంది. ఒక మ్యాచ్ లో బాగా ఆడగానే ఆకాశానికి ఎత్తేస్తారు. బిరుదులు తగిలించి హీరోలను చేస్తారు. ఇలాంటి ప్రచారం ప్లేయర్లపై ఒత్తిడిని పెంచుతుంది. సహజ సిద్ధంగా ఆడలేరు. ప్రస్తుతం జైష్వాల్ కు 22 ఏళ్ళే. అతని విషయంలో సంయమనం పాటించాలి అంటూ గౌతమ్ గంభీర్ సూచించాడు.