కోపంలో భార్య చేసిన పనికి.. భర్తకు సర్జరీ?
ఏది ఏమైనా భార్య అనే మెటీరియల్ మాత్రం చాలా డేంజర్ అని భర్తలు కొంతమంది సీరియస్గా.. ఇంకొంతమంది జోక్ గా ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. అయితే భార్యతో పెట్టుకుంటే ఎంత ప్రమాదం పొంచి ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధనం. ఇలాంటి గొడవలు జరిగినప్పుడే ఏకంగా వారి బంధం కూడా మరింత బలపడుతుంది అని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ భార్యతో జరిగిన చిన్న గొడవ ఏకంగా అతన్ని ఆసుపత్రిపాలు చేసింది. అంతేకాదు సర్జరీ చేయించుకునే పరిస్థితికి కారణమైంది.
ఢిల్లీలోని సుల్తాన్ పూరి లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 20వ తేదీన ఇంటిని అమ్మేసి తన వాటా ఇచ్చేయాలని భర్తతో భార్య గొడవకు దిగింది. అయితే భార్యతో గొడవ పడి భర్త అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా.. నిందితురాలు వెనకనుంచి అతనిపై దాడి చేసింది. ఏకంగా అతని చెవిని కొరికేసింది. దీంతో బాధితుడు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చెవిని పూర్తిగా కొరికి వేయడంతో ఇక ఆ చెవిని సర్జరీ చేసి అతికించాలి అని వైద్యులు సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.