టికెట్ రేట్ల పెంపుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నాకు సంబంధం లేదంటూ?
గతంలో 'పుష్ప 2' ప్రీమియర్ షోల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటనకు అనుమతులు ఇచ్చినందుకు తాను ఎంతో బాధపడ్డానని, బాధితులకు తన వంతుగా వ్యక్తిగత ఆర్థిక సాయం కూడా చేశానని గుర్తుచేశారు. ఆ చేదు అనుభవం తర్వాత ప్రీమియర్ షోలకు లేదా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులకు ముందే ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన 'రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్' వంటి సినిమాల టికెట్ ధరల పెంపు ఫైళ్లు కనీసం తన వద్దకు కూడా రాలేదని ఆయన వివరించారు.
తన ప్రమేయం లేకుండానే కొన్ని సినిమాలకు సంబంధించిన జీవోలు విడుదల కావడంపై కోమటిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ అంశంపై కూడా తాను ఆసక్తి చూపడం లేదని, కావాలనే కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిప్పులాగా బ్రతికిన తనను ఇలాంటి వివాదాల్లోకి లాగి మానసికంగా హింసించడం తగదని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిని ఆ దేవుడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రజల మద్దతుతోనే తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
జిల్లా మంత్రిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో అధికారులు పక్కన కూర్చోవడాన్ని కూడా తప్పుబట్టడం విచారకరమని ఆయన అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని మంత్రి స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు ఉన్నప్పటికీ, పరిశ్రమలోని కొందరు వ్యక్తుల తీరు వల్ల తాను ఈ రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు, తనకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పడం ద్వారా ఆయన ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.