భోగి పండ్లను పిల్లల తలపై పోయడం వెనుక కారణాలివే..?
సంక్రాంతి పండుగ వేళ మొదటి రోజైన భోగి పండుగకు మన సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్న పిల్లలకు ఈ రోజున 'భోగి పండ్లు' పోయడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక అందమైన ఆచారం. దీని వెనుక కేవలం సంబరమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. భోగి పండ్లు అంటే కేవలం రేగు పండ్లు మాత్రమే కాదు.. రేగు పండ్లతో పాటు చిల్లర నాణేలు, చెరకు ముక్కలు, అక్షతలు, బంతి పూల రెక్కలను కలిపి పిల్లల తలపై నుంచి ధారగా పోస్తారు.
శాస్త్రీయ కోణంలో చూస్తే, ఈ వేడుకలో ప్రధానంగా ఉపయోగించే రేగు పండ్లకు 'అర్క ఫలాలు' అని పేరు. సూర్యుడికి అర్కుడని నామాంతరం ఉన్నందున, సూర్య కిరణాల్లో ఉండే శక్తి ఈ పండ్లలో నిక్షిప్తమై ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ పండ్లను పిల్లల తలపై పోయడం వల్ల వారి తలలో ఉండే 'బ్రహ్మరంధ్రం' ద్వారా ఆ శక్తి ప్రసరించి, పిల్లల మెదడు చురుగ్గా మారుతుందని, వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే ఈ సంధి కాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. రేగు పండ్లలో ఉండే సి-విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఆధ్యాత్మికంగా చూస్తే, పిల్లల మీద ఉన్న దిష్టి తొలగిపోవాలని ఈ కార్యక్రమం చేస్తారు. రేగు పండ్లు సూర్యుని ప్రతిరూపాలు కాబట్టి, వాటిని తల మీదుగా పోయడం వల్ల పిల్లల చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించి, సుఖసంతోషాలు కలుగుతాయని భావిస్తారు. అలాగే, ఈ పండ్లను పోసేటప్పుడు ముత్తైదువులు ఇచ్చే ఆశీర్వాదం పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచంలా నిలుస్తుందని నమ్ముతారు. శ్రీమహావిష్ణువుకు రేగు పండ్లు అత్యంత ప్రీతిపాత్రమైనవి కాబట్టి, ఆ స్వామి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని పెద్దల మాట. అందుకే ఈ వేడుకను కేవలం ఒక వినోదంగా కాకుండా, పిల్లల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడే ఒక పవిత్ర సంస్కృతిగా మనవారు పాటిస్తున్నారు.