కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ షాకింగ్ నిర్ణయం !

VAMSI
క్రికెట్ కెరీర్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రపంచం అని చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. అదే విధంగా తమకు నచ్చిన ఆటగాళ్లను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. అయితే అన్ని ఫీల్డ్ లలాగే ఇక్కడ కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒక క్రికెట్ ప్లేయర్ మంచి ఫామ్ లో ఉండి బాగా రాణిస్తుంటే అభిమానులు, క్రికెట్ బోర్డు అందరూ నెత్తిన పెట్టుకుంటారు. కానీ అదే క్రికెటర్ కనుక ఫామ్ కోల్పోయి మంచి ఆటతీరును ప్రదర్శించకపోతే అప్పటి వరకు పొగిడిన నోళ్లే... విమర్శిస్తాయి. కొన్ని సార్లు ఫామ్ కారణంతో, మరికొన్ని సార్లు వివాదాల కారణంగా ఆటకు దూరమవుతుంటారు. ఇదే రీతిలో ఇండియన్ స్పీడ్ బౌలర్ శ్రీశాంత్ టీమిండియాకు దూరమయ్యాడు.

కెరీర్ మంచి ఊపులో ఉండగా ఐపీఎల్ 2013 లో శ్రీశాంత్ కు స్పాట్ ఫిక్సింగ్ తో సంబంధాలు ఉన్నాయని ఐపీఎల్ నుండి బ్యాన్ చేయడం జరిగింది. అది కాస్తా పెద్ద వివాదంగా మారి తనపై జీవితకాల నిషేధం పడింది. అయితే ఈ బ్యాన్ నుండి బయటపడడానికి శ్రీశాంత్ చేయని ప్రయత్నం అంటూ లేదంటే నమ్మండి. అలా ఎన్నో ప్రయత్నాల తరువాత 2019 ఆగస్ట్ లో జీవితకాలం బ్యాన్ నుండి 7 సంవత్సరాలకు తగ్గించింది కోర్ట్. ఆ తర్వాత 2020 నుండి కేరళ స్థానిక టోర్నీలలో ఆడుతున్నాడు. అయితే మళ్ళీ ఎలాగైనా ఐపీఎల్ లో ఆడి ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ గత నెల జరిగిన ఐపీఎల్ మెగా వేలం లో ఒక్క ఫ్రాంచైజీ కూడా శ్రీశాంత్ ను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

ఇక దీనితో నిరాశపడిన శ్రీశాంత్ ఇక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే అవకాశమే లేదు అని డిసైడ్ అయిపోయి ఈ రోజు కాసేపటి క్రితమే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ లో ఉన్న అన్ని ఫార్మాట్ లనుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇది నిజంగా శ్రీశాంత్ అభిమానులకు దురదృష్టకరమైన అని చెప్పాలి. శ్రీశాంత్ తన అంతర్జాతీయ కెరీర్ లో 27 టెస్టులు ఆడి 87  వికెట్లు సాధించాడు.అలాగే 53 వన్ డే లలో 75 వికెట్లు పడగొట్టాడు. ఇక 10 టీ 20 లు మాత్రమే ఆడి 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: