ఇండియాతో మ్యాచ్ అంటే పాకిస్థాన్ ఆటగాళ్లకు నిద్ర పట్టదు...?

Veldandi Saikiran

తాజాగా యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీలో టీం ఇండియా పై పాకిస్థాన్ జట్టు విజయం సాధించి ఓ చరిత్రను సృష్టించింది. ఎందుకంటే.. ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ పై గెలవడం పాక్ కు ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ లో కోహ్లీసేన పూర్తిగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిది ఈ మ్యాచ్ లో భారత్ ను గట్టి దెబ్బ కొట్టాడు. మొదట ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను పెవిలియన్ చేర్చిన అఫ్రిది ఆ తర్వాత అర్ధశతకం చేసిన కోహ్లీని ఔట్ చేసి పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ మ్యాచ్‌కు షాహిన్ షా అఫ్రిది తనకు ఫోన్ చేశాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తెలిపాడు. షాహిద్ అఫ్రిది పెద్ద కూతురితో షాహిన్ అఫ్రిది పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అఫ్రిది కూతురు చదువు పూర్తవ్వగానే వీరి వివాహం జరగనుంది.
అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు షాహీన్ అఫ్రిది తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, దాంతో తనకు ఫోన్‌ చేశాడని గుర్తు చేసుకున్నాడు షాహిద్ అఫ్రిది. తాజాగా టీం ఇండియాతో మ్యాచ్ కు ముందు షాహిన్‌ నాకు వీడియోకాల్‌ చేసి ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడు. అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. వెళ్లి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వు. ప్రత్యర్థి జట్టు వికెట్లు తీసి హీరో అవ్వు' అని చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఆ మ్యాచ్ లో షాహిన్ బంతితో చెలరేగి.. టీమిండియా ఓటమికి కారణమయ్యాడు అని షాహిద్  అఫ్రిది పేర్కొన్నాడు. అలాగే తాను తాను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా భారత జట్టుతో మ్యాచ్‌ కు ముందురోజు పాక్ ఆటగాళ్లకు రాత్రి నిద్ర పట్టకపోయేదని గుర్తు చేసుకున్నాడు.  కొందరు ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ ఆరంభమవుతుందా.. అని ఎదురు చూస్తుంటే... మరి కొందరు ఒత్తిడికి లోనయేవారు ఎందుకంటే... భారత్ - పాక్ మ్యాచ్ అంటే చాలా మంది తమ పనులను పక్కనపెట్టి మరీ చూస్తారు' అని అఫ్రిది తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: