ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో బిజీగా ఉంది. అయిదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి. ఫలితం 1 -1 గా ఉంది. ఇక మిగిలింది రెండు టెస్ట్ లే. నాలుగవ టెస్ట్ రేపు ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్ విన్నర్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా మూడవ టెస్ట్ ఓటమితో ఆత్మరక్షణలో పడింది. ఊహించని విధంగా మూడవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌట్ అవడంతో అక్కడే ఓటమికి నాంది పడింది. అయితే సంచలనాలకు మారు పేరైన టీంఇండియా ఏదో ఒక అద్భుతం చేస్తుందేమోనని భారత అభిమానులు వేచి చూసినా ఫలితం లేకపోయింది. ఇన్నింగ్స్ ఓటమితో మూడవ టెస్ట్ ను ముగించింది. అందుకే ఎప్పుడూ ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు.
టెస్ట్ లో ఒక్క మిస్టేక్ చాలు మ్యాచ్ పోవడానికి, మొదటి రెండు టెస్టులలో బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా మూడవ టెస్ట్ లో పూర్తిగా తేలిపోయింది. క్రికెట్ నిపుణులు చెప్పిన సలహాలు మరియు సూచనలు టీమిండియా పెద్దగా పాటించడం లేదనే చెప్పాలి. జట్టు కూర్పులో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. మూడవ టెస్ట్ కే మిస్టరీ స్పిన్నర్ అశ్విన్ ను తీసుకోవాల్సింది. తనదైన రోజున చెలరేగి వికెట్లు తీయగలడు. బ్యాటింగ్ లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం ఉంది. అలాంటిది ఎందుకు ఇలా చేశారో ఎవ్వరికీ అర్ధం కాలేదు. ఇక వరుసగా విఫలమవుతూ వస్తున్న కెప్టెన్ కోహ్లీ మొన్న అర్ధసెంచరీతో రాణించినా తన స్థాయికి అది సరిపోదు.
ఒకవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వరుస శతకాలతో రికార్డుల వైపు పరుగులు పెడుతుంటే కోహ్లీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు హాఫ్ సెంచరీ దగ్గరే ఆగిపోతున్నాడు. రేపటి నుండి జరగబోయే నాలుగవ టెస్ట్ లో సరికొత్త ప్రణాళికలతో బరిలో దిగకపోతే మళ్ళీ టీమిండియాను ఓటమి వరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విమర్శలు ఎక్కువవుతుండడంతో హనుమ విహారికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక పేసర్ లలో ఒక్కరిని తప్పించి అశ్విన్ ను తీసుకునే అవకాశం ఉంది. జట్టులోకి వీరిద్దరూ వస్తే ఇషాంత్ శర్మ మరియు పుజారా లేదా రహానే లలో ఒకరు తప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇంగ్లాండ్ కన్నా టీమిండియా మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంది. ఇది గెలిచి ఆధిక్యాన్ని 2-1 కు పెంచుకుంటారో లేదా అనేది చూడాలి. అల్ ది బెస్ట్ టీమిండియా.