దీపావళి రోజుకు గల ప్రాముఖ్యత..!

పూర్వం బలి చక్రవర్తిని బంధించి పాతాళమునకు వామనుడు పంపినది ఈ రోజే!రావణుంబరిమార్చి రాముడర్ధాంగితో ననుజన్ము భరతు గాంచినది ఈ రోజే!క్రూరుడౌ నరకాసురుని సత్యభామ కృష్ణుని వెంట జని వధించినది ఈ రోజే!


విక్రమార్కుడు శత్రు విజయంబు గావించి తన పేర శకము నిల్పినది ఈ రోజే!శ్రీమహావీర జిను డహింసా మహస్సు దెసల బ్రసరింప సిద్ధి పొందినది ఈ రోజే!వచ్చె నిదిగొ సౌవర్ణ శోభాప్రపూర్ణ సర్వజనము "దీపావళి పర్వదినము". అలాంటి శుభదినం గూర్చి తెల్సుకుందామా...

 

సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు చేసిన నరకాసుర సంహారానికి పరమానంద భరితులై జరుపుకునే పండుగే "దీపావళి". ఆశ్వయుజమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని నరక చరుర్దశిగా జనులు వ్యవహరిస్తారు. టపాకాయలు కాల్చి ఆచరించుకునే పండుగ కాబట్టి పిల్లలు ఈ పండుగలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.  దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచా కారణంగా వర్షాకాలంలో పుట్టుకు వచ్చిన క్రిమి కీటకాలు నశిస్తాయనే నమ్మకం వల్ల ఇది ఆరోగ్యకరమైన ఆచారం అనే వాదన జనులలో బహుళ వ్యాప్తిలో వుంది. "దిబ్బుదిబ్బు దీపావళి" అంటూ సాయంత్రం కాగానే ప్రమిదలలో వత్తులు వేసి, నూనె పోసి ఇంటిముందు, వరండాలలో దీపాలు వెలిగిస్తారు. దీపావళి అంటే...దీపావళి అంటే దీపముల బారు. ఊరికి దీపం బడి - మనిషికి దీపం నడవడి అంటారు.

 

 దీపావళి రోజుకు గల ప్రాముఖ్యత :

 

దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి, అంతకు ముందు కొందరు ధనత్రయోదశి అని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాత రోజును  కొన్నిచోట్ల బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. బలి చక్రవర్తిని మించిన దానశూరులుండరు అంటారు. వజ్ర, వైఢూర్యాలు, మునిమాణిఖ్యాలు తదితర వస్తువులను దానమివ్వడం కాక, తన్ను తానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. బలిని, ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడ వుంది. 

 

కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు.  దక్షిణభారతదేశంలో దీపావళి మూడునాళ్ళ పండుగగా జరుపుకుంటే, ఉత్తరభారతదేశంలో, మొత్తం ఐదు రోజులపాటు దీపావళిని జరుపుకోవడం పరిపాటి. ధనత్రయోదశి లేక ధన్ తేరస్ లేక యమత్రయోదశి (మొదటిరోజు), నరకచతుర్దశి (రెండవరోజు), దీపావళి (మూడవరోజు), బలిపాడ్యమి (నాల్గవరోజు), భ్రాతృద్వితీయ లేక యమద్వితీయ (ఆఖరుగా ఐదవరోజు) జరుపుకుంటారు. 

 

మరో ఇతివృత్తం :

 దీపావళి జరుపుకోవడం, మూడు, ఐదు రోజులపాటు జరుపుకోవడం ఒక పద్ధతి అయితే, పండుగను ఆచరించుటలో మరియొక పద్ధతి కూడ దర్శనం అవుతుంది. ప్రధానంగా, నరకాసుర వధ, బలిచక్రవర్తి రాజ్య దానం, శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమేవేశమగుట (భరత్ మిలాప్ అని పిలుస్తారు), విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం, ప్రధానేతివృత్తాలుగా గోచరిస్తాయి. 

 

దీపం "దైవస్వరూపం"  :

 సాధారణంగా...యమదీపం - త్రయోదశి నాటి సాయంకాలం, యింటి వెలువల యమునికొరకు దీపం వెలిగించడంవల్ల అపమృత్యువు నశిస్తుంది అని అంటారు. అలాగే, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, మానవుడు యమమార్గాధికారంనుండి విముక్తుడవుతాడని అచంచల విశ్వాసంగా వస్తూంది. దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని, ధర్మశాస్త్రాల్లో వివరించినట్లు కూడ తరచు చెప్తారు. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని "కౌముదీమహోత్సవం" అని నిర్వచించినట్లుగాను, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పాడని వివరించారు. అలాగే, దీపావళినాడు కౌముదీ మహోత్సవాన్ని జరిపేవారని, ముద్రారాక్షసం గ్రంధంలో వివరించినట్లు కూడ తెలుస్తూంది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: