క‌రోనా ఎఫెక్ట్ : క‌ళ త‌ప్పిన రంజాన్‌

N.V.Prasd
హైద‌రాబాద్‌ : క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో రంజాన్ పండుగ‌కు క‌ళ త‌ప్పింది. ప్ర‌తి ఏడాది ముస్లింసోద‌రులు భ‌క్తి శ్ర‌ద్ద‌లతో రంజాన్ పండుగ‌ను జ‌రుపుకుంటారు. నెల రోజుల పాటు ముస్లిం సోద‌రులు ఉప‌వాస దీక్ష‌లు చేస్తారు. ఉప‌వాస దీక్ష చివ‌రి రోజు నెల‌వంక క‌నిపించ‌న త‌రువాత రంజాన్ పండుగ జ‌రుపుకుంటారు. మ‌సీదుల్లో సామూహిక ప్రార్థ‌న‌లు చేసి అనంత‌రం బంధు మిత్రుల‌తో వింధుభోజ‌నాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే ప్ర‌తి ఏడాది జ‌రుపుకునే రంజాన్ పండుగులా ఈ ఏడాది జ‌ర‌గ‌డం లేదు. క‌రోనా మ‌హామ్మారి వేగంగా విస్త‌రిస్త‌తుండ‌టంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు  ఎక్కువ‌గా ఉన్నాయి.దీంతో పెళ్లిళ్లు.పండుగ‌ల‌పై కూడా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.రంజాన్ పండుగ సంద‌ర్భంగా ముస్లిం సోద‌రులు ఇళ్ల‌లోనే ప్రార్థ‌న‌లు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు తెలిపాయి.

హైదరాబాద్ నగరంలో రంజాన్ సందర్భంగా పాతబ‌స్తీలోని షాపుల‌న్నీ కిట‌కిట‌లాడుతాయి.ఈ నెల రోజుల్లోనే కోట్ల రూపాయ‌ల వ్యాపారం ఇక్కడ జ‌రుగుతుంది.అయితే ఈ ఏడాది క‌రోనా  కారణంగా చరిత్రలోనే తొలిసారిగా రంజాన్ పండుగ స‌మ‌యంలో పాత‌బ‌స్తీలోని షాపుల‌కు కళ తప్పింది. ఇఫ్తార్‌ విందులు, వస్త్రాలు, హోటళ్లు, అత్తరు పరిమళాలు, లాడ్‌బజార్‌ గాజుల దుకాణాలు అన్నీ మూతపడ్డాయి దీంతో రంజాన్ ప్రారంభం అయినా మార్కెట్లన్నీ బోసిపోయాయి.రంజాన్‌ మాసానికి రెండు నెలలకు ముందు నుంచే సేమియాల తయారీ కొనసాగుతుంది. గత నెల నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో సేమియా తయారీకి అవసరమైన ముడిసరుకు లభించక‌పోవ‌డంతో ఎక్క‌డా కూడా సేమియా క‌నిపించ‌డంలేదు.

పాతబస్తీలోని పటేల్‌ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్‌గంజ్, ఘాన్సీబజార్, చార్‌కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్‌గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారాలకు పెట్టింది పేరు . వీటి వ్యాపారం మామూలు కన్నా రంజాన్ నెలలో మూడు రెట్లు ఉంటుంది. అయితే కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఇవన్నీ మూతపడ్డాయి.చీరలు, వస్త్రాలకు పాతబస్తీలోని పటేల్‌ మార్కెట్‌ కేంద్రబిందువు. అయితే ఈ రంజాన్‌ మాసంలో వస్త్ర దుకాణాలు తెరుచుకునే పరిస్థితులు లేవు. దాదాపు 2 వేల వరకు ఇక్కడ దుకాణాలున్నాయి. దాదాపు 50 టెక్స్‌టైల్స్‌ ఫ్యాక్టరీల అనుబంధ వ్యాపారాలు వుంటాయి. లాక్ డౌన్ కారణంగా కొత్త బట్టలు కుట్టించుకునేవారే కనిపించడంలేదు. దీంతో టైలర్లు ఉపాధి కోల్పోయారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ,శంషీర్‌గంజ్‌ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి.

మ‌రోవైపు చికెన్‌, మ‌ట‌న్ షాపులు మాత్రం కిట‌కిట‌లాడుతున్నాయి.రంజాన్ పండుగ సంద‌ర్భంగా ముస్లిం సోద‌రులు స‌హాపంక్తి భోజ‌నాలకు దూరంగా ఉండి ఎవ‌రి ఇళ్ల‌లో వాళ్లే పిండి వంట‌లు, చికెన్‌, మ‌ట‌న్ వండుతున్నారు. దీంతో చికెన్‌,మ‌ట‌న్‌, కూర‌గాయాల మార్కెట్లు మాత్రం కిట‌కిట‌లాడాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: