పండుగలకి ఇంటి ముందు మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా ?

VAMSI
ఇంట్లో ఏదైనా పండుగ అయినా, శుభకార్యాలు అయినా వెంటనే ముందుగా చేసే పని, ఇంటి ముందు గుమ్మానికి తోరణాలు కట్టడం. తెల్లవారుజామునే లేచి తలస్నానమాచరించి తర్వాత గుమ్మాలకు పసుపు రాసి, మామిడి ఆకులుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాటిని గుమ్మాలకు తోరణాలుగా కడతారు. ఆ తర్వాత మిగిలిన పని, పిండి వంటకాలు, పూజలు వంటి పనులు చేసుకుంటారు. అయితే తోరణాలుగా మామిడి ఆకులనే ఎందుకు కట్టాలి ? అందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని ఎంతో మందికి సందేహం కలగవచ్చు. గుమ్మానికి తోరణాలుగా మామిడాకులనే ఎందుకు కడతారు అంటే, మామిడి అనేది దేవతా వృక్షం. మిగిలినటువంటి అన్ని చెట్ల ఆకులకి మామిడి ఆకులకి కాస్త వ్యత్యాసముంది. మామిడి ఆకులను ఒకసారి చెట్టు నుండి కోసినట్లు అయితే దాదాపు మూడు రోజుల పాటు అది దానిలో ఉండే శక్తిని కోల్పోదు. పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది.
మామిడాకులు దేవతా స్వరూపాలకు ఆహ్వానం పలికే పరమ పవిత్రమైన పత్రాలుగా పాత్ర వహిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకనే పండుగలకు ఆ దేవుళ్ళను మన ఇంట్లోకి ఆహ్వానించగలిగే మామిడి ఆకులను గుమ్మానికి తోరణాలుగా కట్టడం శుభ సూచకమైన ఒక కారణం. అంతే కాకుండా మామిడి ఆకులలో ఎన్నో ప్రత్యేకమైన వైద్య గుణాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పండుగల సమయంలో మన ఇంటికి ఎంతో మంది చుట్టాలు మరియు బయటివారు వస్తుంటారు. అలాంటి వారికి ఎవరికైనా అంటువ్యాధులు లాంటివి ఏవైనా ఉంటే, మనం గుమ్మానికి కట్టిన మామిడి తోరణాల ద్వారా వచ్చే వాసనను మనం పీలుస్తుంటాము  కాబట్టి ఆ అంటువ్యాధులు మనకు సోకకుండా ఉంటాయి. అంటే ఆ వ్యక్తులకు ఉన్నటువంటి రోగాలు మనకు అంటుకోకుండా  మామిడి ఆకులు రోగనిరోధకశక్తి వాహకాలుగా పనిచేస్తాయి.
అంతేకాకుండా మామిడి ఆకులు ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తేవడంతో పాటు, నిద్రలేమిని పోగొడతాయి అని చెబుతున్నారు. అందుకే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మామిడి ఆకులను మాత్రమే మన ఇంటి ముందు గుమ్మాలకు తోరణాలుగా కట్టాలి అని పెద్దలు చెప్పిన ఆచారం. కాలాలు మారుతున్నా మన సంస్కృతి సంప్రదాయాలలో ఈ పద్ధతి మారకపోవడం నిజంగా అదృష్టం. ఇప్పటికీ ఈ పద్ధతి అందరూ పాటిస్తూ మన హిందూ సంప్రదాయాలను గౌరవిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: