శివః : శివుడు కొలువై ఉన్న ధర్మస్థల పుణ్యక్షేత్రం విశేషాలు తెలుసా...!
హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. దేశంలో శివుడు కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ధర్మస్థల ఒకటి. దక్షిణ కర్ణాటక జిల్లాలోని బెల్తంగడి తాలూకా నేత్రావతి నది తీరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శివుడిని మంజునాథ స్వామి అనే పేరుతో కొలుస్తారు. వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే పూజారులు అర్చన చేయడం ధర్మస్థల ఆలయం ప్రత్యేకత. బంగారు లింగానికి ధర్మస్థల క్షేత్రం ప్రసిద్ధి చెందింది.
జైన్ మతస్థులు ఈ ఆలయానికి నిర్వాహకులుగా ఉంటారు. వారి ఆధ్వర్యంలో హిందూ పూజారులు శివుడికి అర్చన, పూజలు చేస్తారు. ఈ ఆలయంలో నవంబర్, డిసెంబర్ నెలల మధ్య లక్ష దీపాల ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. దాదాపు 600 ఏళ్ల క్రితం వెలసిన మంజునాథ స్వామి ఆలయంలో వైదిక ధర్మాన్ని ఆచరించి స్వామి వారికి, అమ్మవారికి పూజలు చేయడం గమనార్హం.
భక్తులు కోరుకున్న కోరికలు తీరిన తరువాత బియ్యం, నాణేలు, పూలు, అరటిపండు, బెల్లం, మొదలైన వాటితో తులాభారం తూగి స్వామికి మొక్కుబడి చెల్లించుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని హంగులతో కూడిన వసతి గృహాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల లోపు సందర్శించవచ్చు. బాహుబలి విగ్రహం, అన్నప్ప బెట్ట, చంద్రనాథ స్వామి ఆలయం , రామ మందిరం, మంజూషా మ్యూజియం, నేత్రావతి నది వంతెన ధర్మస్థలకు దగ్గరలో ఉన్న చూడదగిన ప్రదేశాలు. బెంగళూరు, మంగళూరు, మైసూరు నగరాల నుండి ధర్మస్థలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.