ఏడుకొండలవాడి శ్రీవాణి ట్రస్ట్.. ఇప్పటి వరకూ విరాళాలు ఎంతంటే..?
ఇటీవల టీటీడీ ఓ కొత్త పథకం ప్రారంభించింది. రూ. 10 వేలు, అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే.. ఏకంగా శ్రీవారి వీఐపీ దర్శనానికి అనుమతి ఇస్తోంది. ఇందు కోసం శ్రీవాణి ట్రస్టు పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీనికి వచ్చే విరాళాలు దేవాలయాల ఉద్దరణకు ఉపయోగిస్తారట. ఈ పథకానికి మంచి స్పందనే వస్తోంది.
అక్టోబరు 21 నుంచి నవంబరు 4వ తేదీ వరకు 1109 మంది భక్తులు కోటీ 10 లక్షల విరాళం ఇచ్చారు. వీఐపీ ప్రివిలేజ్ దర్శనాన్ని పొందారు. ఈ దర్శనం కావాలనుకునే వారు టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లోనూ చెల్లించవచ్చు. మొదటి రోజు ఏడుగురు దాతలు ఆన్ లైన్ ద్వారా సొమ్ము బదిలీ చేసి స్లాట్ తీసుకున్నారట.
ఆన్ లైన్ ద్వారా విరాళాలిచ్చిన భక్తులు ఆరు నెలల్లోపు దర్శనం చేసుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ఈ ఏర్పాటు చేశారు. శ్రీవాణి ట్రస్టు కింద రూ.10వేలు విరాళమిచ్చిన దాతలకు శఠారీ, తీర్థం, హారతితో కూడిన దర్శనం లభిస్తుంది.