మూడు రోజుల పండగ దీపావళి - దీపం - దీపదానం ప్రత్యేకత

హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో దీపావళికి ఒక ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలు, సాయంత్ర వేళ వెలుగు జిలుగుల రంగు రంగుల హరివిల్లు శోభనిచ్చే అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. దీపావళి పండుగ అంటే చాలు గుర్తుకు వచ్చేది టపాసులు చిన్న, పెద్ద, ధనిక, పేద, కులం, మతం అనే బేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ప్రత్యేకమైన పండుగ ఒక్క దీపావళి.

 

ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ. అమావాస్య నాడు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి - మూడవది బలి పాడ్యమి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుణ్ణి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం - నరక చతుర్దశి విశిష్టత. పండుగలకు - ఖగోళ  సంఘటనలకు సంబంధం ఉంది. 

 

నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది.   హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది.

 

దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వర గర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్ట కు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణాభరణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వంద యుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.

 

మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇదనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది.ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.

 

తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశి గా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపు కుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

 

 ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమతర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభిముఖంగా యమాయః తర్పయామి అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది.

 

యముణ్ణి పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాము లో నరకాసుర సంహారం జరిగింది.

 

కనుక మూడో జాములో అభ్యంగనస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తల స్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

 

   చతుర్దశ్యాం తు యే దీపాన్‌

    నరకాయ దదాతి చ|

    తేషాం పితృగణా స్సర్వే

    నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

 

చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనె తో తడిపిన, రసాయన ద్రవ్యాల తో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

 

జ్ఞానానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన “దీపం” ను ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

 

నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ , మార్వాడీల కు ఈ రోజు లక్ష్మీ పూజా దినం. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూప మైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మహిళలు ఎక్కువగా నమ్ముతారు.

 

దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస - దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్య దిన సాయం సంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు తొలుత దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి  చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ అని ధ్యానిస్తారు. తులసీ పూజానంతరం గృహ మంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలిఅందియలు ఘల్లుఘల్లుమంటూ ఆ గృహంలో ప్రవేసించి నివాసముంటుందని హిందువుల విశ్వాసం.


ఆశ్వయుజ శుద్ధ చతుర్దశిని నరక చతుర్దశి అని, ఆ మరుసటి రోజు దీపావళి అని, మహా ప్రముఖమయిన పండుగలుగా మహాలక్ష్మి అశీస్సుల కొరకు, అనుగ్రహము కొరకు భారత దేశమే కాదు, విదేశాలలో ఉండే హిందువులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు.  నేపాల్, శ్రీలంక, మలేషియా, యూరప్, అమెరికా మొదలగు దేశాలలో వేడుకగా జరుపుకొను పండగ ఈ దీపావళి. దీనిని కొన్ని ప్రాంతము లలో, ఐదు రోజులు, నాలుగు రోజులు, మూడు రోజులు, రెండు రోజుల పండుగగా జరుపుకొను అచారమున్నది.

ప్రాంతాల వారిగా దేశ, కాల ఆచారము బట్టి జరుపుచున్నారు. త్రయోదశి నాడు, అక్షయ తృతీయ అని, తరువాత నరక చతుర్దశి అని తరువాత అమావాస్య నాడు దీపావళిగా, తరువాత కార్తిక మాసం మొదటి రోజు పాడ్యమి నాడు బలి పాడ్యమని, విదియ నాడు యమ విదియ గాను, ఈ పండుగను భారత దేశంలో అనాదిగా ఆచరించు చున్న ఆచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: