అయ్యప్పదీక్షనియమావళి

1.   ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి.


2.   రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి.

3.  నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.

4.  కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.

5.  మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సాన్నిధ్యము చేరుటకు కనీసము 41 రోజులు ముందుగా   దీక్ష ఆరంభించాలి.

6.  దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకొనరాదు.

7.  అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండుట శ్రేయస్కరము.
దాంపత్యజీవితము మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము. 

8.  మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము. 

9.  అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి, పంచగవ్య  శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.
 
10.  దీక్షలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను. 

11.  దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.

12.  తమ పేరు చివర 'అయ్యప్ప' అని పదము చేర్చాలి. ఇతరులను 'అయ్యప్ప' అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను 'మాలికాపురం'  లేదా   'మాతా' అని పిలవాలి.

13.  అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించరాదు.

14.  అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.

15.  మద్యము సేవించుటగాని, పొగాకు పీల్చుట వంటి దురలవాటు మానుకొనవలెను. తాంబూలం కూడా నిషిద్ధమే.

16.  రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను. 

17.  తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.

18.  హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి. అబద్దమాడుట, దుర్బాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా  వుండాలి. 
      
19.  ప్రతి దినము స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.

20.  అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే పదునెట్టాంబడి.

21.  శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది.

22.  స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.

23.   దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు  వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం  చేయరాదు.
అయ్యప్ప మాలలోని అంతరార్థం!
 
 
 శివకేశవుల భక్తులందరినీ ఈడేర్చవచ్చినవాడే అయ్యప్ప! `అయ్యా`అన్నా`అప్పా` అన్నా ఆదుకునేవాడే ఈ హరిహరసుతుడు. కార్తీకమాసం దగ్గరపడుతోందంటే చాలు శబరిమలను చేరేందుకు 41 రోజుల దీక్షను ధరించాలని ఉవ్విల్లూరుతుంటారు భక్తులు. కేవలం 18 మెట్లను ఎక్కి శబరిగిరీశుని చూసేందుకు పట్టే దీక్ష కాదు ఇది. భౌతిక సుఖాలను కాదనుకుని, ప్రకృతి పెట్టే పరీక్షలో నిగ్గుదేలి, స్వామి సన్నిధికి సవినయంగా చేరుకునే అరుదైన అవకాశం! మాలధారణలో ఉన్న కొన్న నియమాలు, వాటి వెనుక ఉన్న అంతరార్థం… 
 
ప్రాతఃకాల స్నానం: ఎంత ఆలస్యంగా లేచే వీలుంటుందా అని ఆలోచిస్తాము చలికాలంలో! అలాంటిది సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని చన్నీళ్లతో తలస్నానం చేయాలని సూచిస్తోంది అయ్యప్పదీక్ష. దీనివల్ల రెండు ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి- వాతావరణం ఎలా ఉన్నా కూడా దానికి తట్టుకుని నిలబడే స్థైర్యాన్ని అలవర్చుకోవడం. రెండు- శరీరంలో ఎప్పుడూ నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగే వ్యవస్థ ఉంటుంది. రక్తప్రసరణలో తగు మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. చన్నీరు ఒక్కసారిగా మీద పడగానే మనలోని రక్తప్రసరణ మందగిస్తుంది. వెంటనే ఎండ తగలగానే రక్తప్రసరణ  వేగాన్ని అందుకుంటుంది. అప్పటివరకూ మందగించిన రక్తప్రసరణ ఒక్కసారిగా వేగాన్ని అందుకోవడం వల్ల శరీరంలోని చిన్నపాటి దోషాలు పరిహరింపబడతాయి.


క్షవరము లేకపోవడం: దీక్షలో ఉన్నన్నాళ్లూ స్వాములు క్షవరానికి దూరంగా ఉంటారు. ఈ నియమం వల్ల ఒకటీ, రెండూ కాదు మూడులాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి- శరీరం పట్ల నిర్లిప్తత! శరీరాన్ని గారాబంగా చూసుకుని, దాన్ని చూసి మురిసిపోతుంటే మోహం తప్ప మరేమీ మిగలదు. మన యాత్రను కొనసాగించేందుకు అది ఒక వాహనం మాత్రమే అని గ్రహించినరోజున దాని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో అంతే ప్రాముఖ్యతను ఇస్తాం. దాన్ని గుర్తుచేసేదే ఈ నియమం! రెండు- చలికాలం సూర్యోదయానికి ముందే కాలకృత్యాలను తీర్చుకుని, పల్చటి వస్త్రాలను ధరించి, కటిక నేలల మీద నిదురించే స్వాములకు చలి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మూడు- దీక్ష సమయంలో స్త్రీ సాంగత్యం నిషిద్ధం. ఆ విషయంలో ఎలాంటి ప్రలోభాలకూ తావులేకుండా, భౌతికమైన ఆకర్షణను తగ్గించేందుకు ఈ నియమం దోహదపడుతుంది.


నల్లని వస్త్రధారణ: తెలుపు సూర్యకిరణాలను ప్రతిఘటిస్తే, నలుపు రంగు వేడిని ఆకర్షిస్తుంది. చలికాలం కఠినమైన నియమాలను పాటించే స్వాములకు ఈ రంగు మాత్రమే కాస్త వెచ్చదనాన్ని కలిగించి అండగా నిలుస్తుంది. పైగా కాషాయంలాగానే నలుపు కూడా వైరాగ్యానికి ప్రతీక! దీక్ష కొనసాగినన్నాళ్లూ తాము స్వాములుగా ఉంటామనీ, వైరాగ్యానికి ప్రతినిధులుగా కొనసాగుతామనీ సూచించే ఈ నలుపు రంగు వస్త్రాలను అయ్యప్పలు ధరిస్తారు.
 
పాదరక్షలు నిషిద్ధము: ఈ రోజుల్లో పాదరక్షలు లేకుండా బయటకు అడుగుపెట్టడం అసాధ్యం. మనిషి స్థాయిని కూడా పాదరక్షలను బట్టే నిర్ణయిస్తూ ఉంటారు. కాలికి మట్టి అంటుకోకుండా పెరగడాన్ని అదృష్టజాతకంగా భావిస్తారు. `సుకుమారమైన పాదాలు`, `పాదాలు కందిపోకుండా`… లాంటి వాక్యాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ శబరిమల పర్వతాన్నే కాదు ఈ జీవితాన్ని కూడా అధిరోహించాలంటే ఒకోసారి కఠినత్వం అవసరపడుతుంది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము. అన్ని కష్టాలనూ తట్టుకుని, అన్ని అడ్డంకులనూ దాటుకునేందుకు మనిషి ఎప్పుడూ సిద్ధంగా, సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం కొంత కఠినత్వాన్ని కూడా అలవర్చుకోవాలి. గరుకు నేల మీద నడిచే అలవాటుని చేసుకుంటే పాదాలే చెప్పులుగా మారి రాటుతేలిపోతాయి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా శ్రమించే గుణానికి శిక్షణే ఈ నియమం!
 
 
మాలలోని స్వాములకు ఇంకా చాలానే నియమాలు ఉన్నాయి. మితాహారం, మత్తుపదార్థాల నిషిద్ధత, కటికనేల మీద నిదురించడం… అన్నీ కూడా వారి ఆధ్యాత్మిక పురోగతికీ, భౌతిక దృఢత్వానికీ నిర్దేశించినవే! అందుకనే ఒక్కసారి మాల వేసుకున్న భక్తులు, ఆ దీక్ష రోజులు ఎప్పుడు ముగిసిపోతాయా అని కష్టంగా రోజులను గడపరు, మళ్లీ మాలధారణ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తారు.
అయ్యప్ప మాల ప్రాముఖ్యత ఏమిటి?
 
మన పూజా విధానంలొ జపమాలగా ఉన్నత స్థానాన్ని పొందిన కంఠాభరణాలు తులసి, రుద్రాక్ష, చందనం, స్పటికం, పగడాలు తామర పూసల మాలలు. రుద్రాక్షలు అనేవి అ పరమేశ్వరుడు ఐన శివుని అంశ వలన ఉద్భవించినవిగా ప్రతీక. అందువలన రుద్రాక్షల మాలలు అన్నింటిలొ శ్రేష్టమైనవిగా చెప్పుకుంటాము. రుద్రాక్షల వలన రుద్రాక్షలు ధరించటం వలన మనకు చాలా మంచి ఫలితాలు అనగా భూత పిశాచ భాధలు తొలుగుతాయి అంతేకాక మన ఆరోగ్యానికి కూడా ఎంతొ మంచిది. రుద్రాక్ష అధిక కొపాన్ని తగ్గించి బి.పిని కంట్రోల్ చేస్తుంది ఏన్నో ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి మాల విష్ణుమూర్తికి ప్రతీక. ఈ మాల ధరించటం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. చందన మాల శరీరానికి తాపనివారిణిగా పనిచేస్తుంది. స్ఫటికమాల మాలిన్యాలను గ్రహిస్తుంది. పగడమాల వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తామర పూసల మాల చర్మ వ్యాధులను దరిచేరనివ్వదు. అందుకే ఈ పరమ పవిత్రమైన మాలలకు పూజ, అభిషేకం చేసి, ఆ మాలల యందు అ అయ్యప్ప స్వామిని ఆవహింపచేసి వాటిని ధరించి భక్తులు అందరూ శుధ్ధిగా దీక్ష తీసుకుంటారు.


 అయ్యప్పస్వామి స్వరూపాలు
శ్రితజనప్రియం స్వామి చించితప్రదం 
శృతి విభూషణం స్వామి సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే 


నారాయణుడు, పరమశివుడు ఇద్దరూ  ఒక్కరే అని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్పస్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోమమూ ఉంటుంది. తలపై ధరించే చంద్రునిముడిలో  శంకరునికి సంబంధించిన మూడునేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ, నెయ్యి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులుంటాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి! శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా, మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తలపిస్తుంది.
పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్పస్వామి, ఎడమచేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహీనీ అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని  రుద్రాక్షమాల శంకరునిది అయితే, తులసిమాల శ్రీహరికి ఇష్టం అయినది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో ముగుస్తుంది. 


అయ్యప్ప దర్శనానికి 40 రోజులు దీక్షను పాటిస్తారు. మన శారీరక, మానసిక వ్యవస్థ భక్తితో చైతన్యం కావడానికి సుమారు 40 రోజులు పడుతుంది. మంత్ర, దీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించారు. భారతీయ శాస్త్ర సంప్రదాయంలో మండలకాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది. 
అయ్యప్పస్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న పద్దెనిమిది మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్లు గురించి మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు (8), త్రిమూర్తులు (13), వారి భార్యలు (3), ఇంద్రుడు (1), బృహస్పతి (1), ఆదిపరాశక్తి (1), సూర్యుడు (1) అంటూ మొత్తం పద్దెనిమిది మంది దివి నుండి భువికి దిగిరాగా, దేవాలయ ప్రతిష్ఠనాడు మృదంగ, భేరి, కాహళ, దుందుభి, తుంబురు, మర్దల, వీణ, వేణు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, దవళ, శంఖ, పటహ, జజ్జరి, జంత్ర, అనే 18 వాయిద్యాలను మ్రోగించారు.
 హరిహరసుతుడు అయ్యప్పస్వామి !


కలియుగంలో మనిష్యులను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్పస్వామి.
అయ్యప్పస్వామి కరుణాకటాక్షాలకోసం దీక్ష పూని, ఓ మండలంరోజుల పాటు ఆ దీక్షను కొనసాగించి,తర్వాత ఇంట్లో పూజచేసి, అఖండదీపాన్ని వెలిగించి, ఆత్మదీప దర్శనం కోసం ఇరుముడిని ధరించి శబరిమలయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది అయ్యప్ప స్వామికి మండలదీక్ష (48 రోజులదీక్ష) ఎందుకు? ఒకరోజు, ఐదురోజుల దీక్ష కూడ చేయవచ్చుగా అని అడుగుతున్నారు. అడగడమే కాదు, ఆ పద్దతుల్లో దీక్షలు చేపట్టి జ్యోతి దర్శనానికి బయలుదేరుతారు. ఆ వాదప్రతివాదనలను అలా వుంచితే, మండలదీక్షలో ఓ గూఢార్థం ఉంది. మనిషి పుడుతున్నప్పుడు, అప్పుడున్న నక్షత్రస్థితి, రాశిస్వభావం, ఇంకా అప్పటి గ్రహస్థితులు, ఆ మనిషి భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృష్టితో చూసినప్పుడు


నక్షత్రాలు  - 27
రాశులు   - 12
గ్రహాలు    - 09
మొత్తం    -  48


వీటి ప్రభావం నుంచి తప్పుకుని, భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారమనే జ్యోతి దర్శనానికే 48 రోజుల దీక్ష చేస్తున్నాం. ఇదే మండలదీక్షలోని అంతరార్థం. అందుకే మండలకాలంపాటు దీక్ష.
 శరణు శరణు... అప్పయ్య శరణు.


ఎటుచూసినా శరణు ఘోష. ఊరూవాడా అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర దీక్షతోస్వామీ అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు, శరణమయ్యప్ప మము కావుమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమలై వైపు అడుగులు వేస్తుంటారు. శరీరాన్నీ. మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్ళించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే కార్తీకమాసం. పరిమితకాలంలోనే      అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే ఆద్యం. మోక్షమార్గాన్ని అన్వేషించే వారూ,   సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారూ తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై  యాత్ర చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు.
 
కేరళలోని పంపానదికి చేరువన ఈ పవిత్ర కొండ (మలై) ఉంది. పశ్చిమకనుముల్లోని దట్టమైన అడవిప్రాంతంలో ఉన్న శబరిమలై భక్తుల ఆధ్యాత్మిక దాహం తీర్చే పుష్కరణి. పంపానది నుంచి ఆలయానికి చేరేలోపు భక్తులకు అనేక పరీక్షలు తప్పవు. ఎత్తైన కొండప్రాంతం, ఆపైన దట్టమైన అడవి...ఎంతటివారికైనాసరే, అయ్యప్ప దర్శనం సులువుగా లభ్యంకాదు. కొలిమిలో కాలితేనేకానీ లోహం మాట విననట్టే, ఈ దేహం కూడా భగవంతుడు పెట్టే పరీక్షలో కాలాల్సిందే. దానికి దగ్గర దారిలేదు. ఈ సత్యాన్ని చాటిచేప్పేది శబరిమలై యాత్ర. చలికాలం...మాట వినని స్థితిలో ఉన్న శరీరాన్ని లొంగదీసుకోవాలంటే, ఈ దేహచింతనను విడనాడి అలౌకికానందపుటంచులు చవిచూడాలంటే అందుకు మనము ముందు ఉన్న ఏకైక మార్గం స్వామి అయ్యప్ప మండలదీక్షే.


ఆద్యంతం భక్తి పారవశ్యమే :- 
శబరిమలై యాత్ర ఆద్యంతం భక్తి పారవశ్యమే. లక్షలాది మంది భక్తులు ఎరుమేలి అనే స్థలికి చేరుకుంటారు. అక్కడ పేటతుల్లి ఆడివావరు స్వామి, పేటశాస్త్రీలను దర్శించుకుని ఆ తరువాత స్వామి సన్నిధానం చేరుతారు. పంపానది నుంచి బయలుదేరి ఇరుముడి మోసుకుంటూ కొండ అంచున ఉన్న అప్పాచిమేడుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణం సాగిస్తే బహిరంగప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. దీన్నే శ్రీరాముని కోసం శబరి నిరీక్షించిన ప్రదేశంగా చెబుతుంటారు. పంపానదికి. సన్నిధానానికీ మధ్య ఉన్న శరంగుత్తి ఆల్ కు భక్తులు చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లాలను అక్కడ ఉంచుతారు. ఆ తరువాత సన్నిధానం చేరుకుని అయ్యప్పస్వామిణి దర్శించుకుంటారు.


అద్వైత మలై :-
అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. ఆయన హరిహర సుతుడు.శ్రీమన్నారాయణుడు మోహినీఅవతారంలో ఉండగా, శివ కేశవులకు జన్మించిన వాడే స్వామి అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర బేధం లేదు. అద్వైతానికి నిలువెత్తు కొండ శబరిమలై.  కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరుని తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. 41 (మండల) రోజులపాటు ఈ దీక్ష కొనసాగుతుంది. పదునెట్టాండి (18 మెట్లు) ఎక్కి స్వామివారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్ళీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్ళీ అయ్యప్పస్వామిని కనులారా చూస్తామా... అంటూ పరితపిస్తుంటారు భక్తకోటి. ఇనుమును సూదంటురాయి (అయిస్కాంతం) ఆకర్షించిన రీతిలోనే అయ్యప్ప తన భక్తులను ఆకర్షిస్తుంటాడు. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి జనవరి మూడు వరకు మండల దర్శనం, అటుపై జనవరి పది నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా  పరిగణిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: