సీతాదేవి.. మన పురాణగాధల్లో ఇంతటి సద్గుణ సంపన్నురాలైన మహిళామూర్తి మనకు వేరే ఇంకెవ్వరూ కనిపించరు. పతియే ప్రత్యక్షదైవమని తలచి.. అతడెక్కడుండే అక్కడే స్వర్గమని భావించి అరణ్యవాసానికి సైతం వెనుదీయని సుకుమారవతియైన రాణి ఆమె. భర్త తోడుంటే అరణ్యమైనా భూతల స్వర్గమే అని భావించిన ఆదర్శ పత్ని.
సహనవతి, శీలవతి అయిన సీతాదేవిలో ఎన్ని సుగుణాలు ఉన్నా.. ఒకే ఒక్క బలహీనత కారణంగా ఆమె ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఒకానొక బలహీన క్షణంలో తళుకుబెళులకు ఆశపడి ఆమె కష్టాలు కొని తెచ్చుకుంది. ఆ ఒక్క బలహీనత కారణంగా ఎన్ని సుగుణాలు ఉన్నా.. ఆమెకు ఇబ్బందులు తప్పలేదు.
అరణ్యవాసంలో పంచవటిలో ఉన్న సమయంలో ఆమె పసిడి లేడిని చూసి చలించడమే కష్టాలకు కారణమైంది. నిత్యం ప్రకాశించే స్వభావం ఉన్న రాముని పక్కనే ఉంచుకుని కూడా ఆమె బంగారు లేడి కోసం తపించింది. వస్తు, విషయాలపై మనసు కేంద్రీకృతమైతే మనస్సు ఎలా పక్కదారి పడుతుందో చెప్పేందుకు ఇది సరైన ఉదాహరణగా పురాణ విశ్లేషకులు చెబుతారు.
అది మాయాలేడి అని శ్రీరాముడు ఎంతగా చెప్పినా సీతాదేవి వినలేదు. తనకు ఆ లేడా కావలసిందేనని పట్టుబట్టింది. మనస్సు తప్పుదారి పడితే అది మంచి మాటలు వినలేదన్న సంగతి దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే మన శ్రేయోభిలాషులు మనకు పదే పదే వద్దు అని సలహా ఇస్తున్నప్పుడు.. మనం చేసేదే సబబన్న ఆలోచన మాని కాస్త వారి కోణంలోనూ ఆలోచించాలి.
శ్రీరాముని మాట వినకపోవడం వల్ల, మొండిగా తన కోరిక నెగ్గాలని పంతం పట్టడం వల్ల.. సీతాదేవి రావణాసురిడిపాలైంది. లంకలో అశోకవనంలో బందీ అయ్యింది. అష్టకష్టాలు పడింది. అందుకే అల్ప విషయాలపై మమకారం మానుకోవాలి. శ్రేయోభిలాషుల మాట వినాలి. మనకూ బలహీనతలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. స్వీయ సమీక్షతో వాస్తవాలు గుర్తెరగాలి.