పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవాహ్నిక దీక్షతో ఉత్సవాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం 9గంటల 15 నిమిషాలకు అర్చకులు, వేదపండితులు స్వామివారి యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వరపూజ, చండీశ్వర పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా మల్లికార్జున స్వామివారికి, భ్రమరాంబికా దేవికి ప్రత్యేక పూజలు, సేవలు మొదలు కానున్నాయి. కంకణధారణ, అఖండస్థాపన, వాస్తుహోమం, మండపారాధన, కలశస్థాపన లాంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లను వివిధ వాహనసేవలపై ఆశీనం గావించి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
మొత్తం 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 10 నుంచి 15 లక్షల మంది వరకు భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానం సత్రాలు సహా కులపరమైన సత్రాలు కలిపి.. మొత్తం 3 వేల గదుల వరకు ఉన్నాయి.
ముందస్తు ఏర్పాట్లు లేకుండా బ్రహ్మోత్సవాలకు వస్తే ఇబ్బందులు తప్పేలాలేవు.