రండి బాబూ.. రండి.. తక్కువ ధరకే జగనన్న ప్లాట్లు..?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఓ కొత్త పథకం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం నేరుగా రియల్‌ ఎస్టేట్‌ తరహాలో వ్యాపారం ప్రారంభించింది. కాకపోతే.. తక్కువ ధరకే క్లియర్ టైటిల్‌ ప్లాట్లు అమ్మబోతోంది. ఇవాళ జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ద్వారా జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ద్వారా మధ్య ఆదాయ వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ద్వారా మధ్య ఆదాయ వర్గాల వారికి భూముల ధరలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇళ్లస్థలాల కోసం ఇవాల్టి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. ఈ పథకం తొలిదశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమలు చేస్తారు. ఆ తరవాత రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం అమలు చేస్తారు.

రూ.18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు  అర్హులుగా నిర్ణయించారు. అర్హులైనవారికి వారు ఉంటున్న ప్రాంతంలోనే తక్కువ ధరకు స్థలం కేటాయిస్తారు. కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా ప్రభుత్వం ప్లాట్లు కేటాయిస్తుంది. ఈ పథకంలో లబ్ది దారుల అవసరం మేరకు 150, 200, 240 గజాల స్థలాల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

అయితే.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం ఏంటని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని.. డబ్బు కోసమే ప్రభుత్వ భూములను అమ్ముతూ.. దానికి జగనన్న స్మార్ట్ టౌన్లని పేరుపెట్టారని విమర్శిస్తున్నారు. ఇటీవలే ఈ జగనన్న స్మార్ట్ టౌన్లలో ప్రభుత్వ ఉద్యోగులకు పది శాతం కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వారికి రేటులో 20 శాతం రిబేటు కూడా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: