సెటైర్‌: ఇంత జరుగుతుంటే.. సీమ సింహాలు నిద్రపోతున్నాయా..?

Chakravarthi Kalyan
ఏపీ, తెలంగాణ జల జగడంపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే.. జగన్ సర్కారును తూర్పారబ‌ట్టే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం జగన్ పూర్తిగా కేసీఆర్‌ కు లొంగిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ, తెలంగాణ జల వివాదం వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ రెడ్డి బలహీనతలు, బేలతనం బయటపడుతున్నాయట. నిన్నటిదాకా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని బీరాలు పలికి చేతులెత్తేసినట్టే.. ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా తన వ్యాపార ప్రయోజనాలు, ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్‌కు లొంగిపోక తప్పని పరిస్థితి జగన్‌ రెడ్డికి ఏర్పడిందంటున్నారు.

అంతే కాదు.. గతంలో చంద్రబాబు హయాంలో నానా యాగీ చేసిన వారు ఇప్పుడు జగన్ హయాంలో మాత్రం సైలంట్‌గా ఉంటున్నారని ఉక్రోషపడిపోతున్నారు ఆర్కే. జగన్‌ రెడ్డి కాకుండా ఇప్పుడు మరెవరు అధికారంలో ఉన్నా రాయలసీమ నుంచి కొన్ని వృద్ధపులులూ, సింహాలూ సీమ హక్కుల కోసం రోడ్డు మీదకు వచ్చి ఉండేవని ఊహిస్తున్నారు. అయితే... ఇప్పుడు తమవాడే అధికారంలో ఉన్నందున వారికి రాయలసీమలో ఎనలేని అభివృద్ధి కనిపిస్తూ ఉండొచ్చని సెటైర్లు పేల్చారు ఆర్కే. అదే చంద్రబాబు హయాంలో ఇలా జరిగితే.. సీమ నాయకులు రచ్చ రచ్చ చేసేవారంటున్నారు ఆర్కే.

ఈ జల వివాదంలో అసలు ఉన్నదంతా రాజకీయమే అంటున్నారు ఆర్కే. సీమాంధ్ర నాయకుల గురించి కేసీఆర్‌కు బాగానే తెలుసు కనుక ఆయన ఇలాగే ముందుకు వెళుతూ ఉంటారట. ఏపీలోని సర్వ అనర్థాలకూ చంద్రబాబు నాయుడే కారణం అని చెబుతూ వస్తున్న జగన్‌ అండ్‌ కోకు ప్రస్తుత వివాదానికి కూడా చంద్రబాబే కారణమని చెబుతారేమో అని ఆర్కే హాస్యమాడుతున్నారు. పొరుగు రాష్ర్టాలతో, ముఖ్యంగా తెలంగాణతో సఖ్యతగా ఉండాలని తరచుగా చెప్పే జగన్‌ రెడ్డి.. ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానికి కేవలం ఫిర్యాదు చేయడం ద్వారా చేతులు దులుపుకొంటున్నారని ఆర్కే అంటున్నారు.

అటు కేసీఆర్ కూడా రాయలసీమను కూడా కోనసీమగా చూడాలని ఉందని చెప్పిన విషయాన్ని ఆర్కే గుర్తు చేస్తున్నారు. నగరిలో ఉండే ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లి విందు ఆరగించి వచ్చిన కేసీఆర్‌..  ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం ప్రస్తుత వివాదానికి తెర తీశారంటున్నారు ఆంధ్రజ్యోతి ఆర్కే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: