హెరాల్డ్ సెటైర్ : ఈ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండుంటేనా.. నా సామిరంగా

Vijaya
అవును  ఈ సమయంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉండుంటే కరోనా వైరస్ సమస్య మొత్తాన్ని వారంరోజుల్లో పరిష్కరించేస్తారట. ఈ విషయాన్ని జనాలు చెప్పుకోవటం కాదు టీడీపీ నేతలు పదే పదే చెప్పుకుంటున్నారు. టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అనే వీర తమ్ముడు ఒకడున్నారు. ఆయన మాట్లాడుతు కరోనా వైరస్ సమస్యను నియంత్రించటంలో జగన్మోహన్ రెడ్డి విఫలమైయ్యారంటు పదే పదే గోల చేస్తున్నారు. సరే వాళ్ళ అధినేత ఏమి మాట్లాడితే, ఎలా మాట్లాడితే తమ్ముళ్ళు కూడా అలాగే ఫాలోఅయిపోతుంటారు. తాజాగా కరోనా సమస్యపై పట్టాభి మాట్లాడుతు వారం రోజుల పాటు అధికార బాధ్యతలను చంద్రబాబుక ఇచ్చి చూడండని సవాలు విసరటమే విచిత్రంగా ఉంది. అదేదో సినిమాలో తాను కూర్చున్న కుర్చీలో ఒక్కరోజు హీరో పాత్రదారిని  సీఎం పాత్రదారి కూర్చోబెట్టడం అనుకుంటున్నట్లుంది పట్టాభి.



సరే పట్టాభి సవాలు విసిరినట్లుగానే చంద్రబాబును వారంరోజుల పాటు సీఎంగా చేస్తే ఏమవుతుంది ? ఏమవుతుందంటే ఇపుడు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత, ఉదృతిపై 24 గంటలూ వస్తున్న వార్తలు, కథనాలు ఒక్కసారిగా మాయమైపోతాయి. రాష్ట్రంలోని అన్నీ ఆసుపత్రుల్లోను ఆక్సిజన్ నిల్లలు అవసరమైనంత ఉందని, టీకాలు వేయించుకోవటానికి జనాలే రావటంలేదని మీడియా కోడైకూస్తుంది. 18 ఏళ్ళు నిండని వారికి కూడా టీకాలు వేయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం స్పీడుగా అమలు చేస్తోందని మీడియా ఊదరగొట్టడం మొదలవుతుంది. ఆక్సిజన్ నిల్వలు సరపడా ఉండటమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతోందని చెబుతుంది. కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలు కాకుండా మరిన్ని టీకాల కోసం రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలతో నేరుగా చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని కథనాలు వండి వారుస్తారు.



కరోనా వైరస్ నియంత్రణ విషయంలో యావత్ దేశానికే చంద్రబాబు విధానాలు మార్గదర్శకంగా నిలిచినట్లు అదరగొడుతుంది మీడియా. వైరస్ నియంత్రణలో చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్యం సంస్ధ నుండి నిపుణల బృందం ఏపికి వస్తున్నట్లు లీకువార్తలతో చావగొడతారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఇతర ముఖ్యమంత్రులతో చంద్రబాబు ఒక టీమ్ గా ఏర్పడి నరేంద్రమోడి సర్కార్ కే సూచనలు, సలహాలిస్తున్నారటని చెబుతుంది. ప్రపంచంలోని ఎక్కడెక్కడి దేశాల్లోని ప్రవాస డాక్టర్లంతా ఏపికి వచ్చేసి వైద్య సేవలందిస్తున్నట్లు రాస్తుంది మీడియా. అసలు చంద్రబాబు దెబ్బకు కరోనా వైరస్ పారిపోయింది కాబట్టి ఆల్ ఈజ్ వెల్ అంటు పదే పదే వార్తలు, కథనాలను మీడియా పోటిపడి వండి వారుస్తుంది. అవును ఇంతకన్నా ఏమి జరగదు. లోపల అసలు వ్యవహారం ఎలాగున్నా బయటికి మాత్రం మీడియా ఇలానే ప్రొజెక్టుచేస్తుంది. ఎందుకంటే 2014-19 మధ్య జరిగింది ఇదే కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: